తవ్వారు..వదిలేశారు..
- కోట్ల రూపాయలు మట్టిపాలు...
- రాజుల పైసా రాళ్లపాలు అన్న చందంగా....
- పనులు పూర్తి చేయాలి....
తాడ్వాయి,నవంబర్,26( విజయ క్రాంతి): పక్కా ప్రణాళికలు లేకుండా చేసిన పనులతో కోట్లాది రూపాయలు మట్టిపాలయ్యాయి.బీడు భూములుగా ఉన్న రైతుల పొలాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్న ప్రభుత్వ లక్ష్యం(Government's Goal) నీరుగారిపోతుంది. ఓ లక్ష్యం అంటూ పనులు చేయకపోవడంతో ఫలితాలు ఇవ్వడం లేదు.
దీంతో కోట్లాది రూపాయలు వృధా అయ్యాయి.కామారెడ్డి జిల్లాలో కాలేశ్వరం ప్రాజెక్టు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.ఈ పనుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది..కానీ ఒక ఎకరాకు నీళ్లు అందించలేకపోయింది. తాడ్వాయి,సదాశివ నగర్,గాంధారి, రాజంపేట మండలాలలో ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కాలువలు తవ్వించింది. ఈ కాలువల నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యాయి.కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక ఎకరానికి రూ.5 నుంచి రూ. 7 లక్షలు చెల్లింపులు...
కాలేశ్వరం కాలువలో నష్టపోయిన రైతుల భూములకు ప్రభుత్వం ఎకరాకు ఐదు నుంచి ఏడు లక్షలు పరిహారంగా చెల్లించారు.ఇలా భూముల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు.
కాలువలు తవ్వడానికి డబ్బులు ఖర్చు అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మా పంటలు పండే భూములు పోయాయి కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
రాజుల పైసా రాళ్లపాలు...
ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేయకపోవడంతో ప్రభుత్వం డబ్బులు రాజుల పైసా రాళ్లపాలు అన్న చందంగా మారిందని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో పెద్ద చెరువును నిర్మించారు.అక్కడి నుంచి తాడువాయి, రాజంపేట మండలాలకు కాలువలు తవ్వారు. వాటిని వదిలేశారు. ప్రస్తుతం కాలువలు వృధాగా ఉంటున్నాయి.
కాలువలు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలి..
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలువలు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు. ముందుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కాలువలు తవ్వారు. అదే కాలువలను కాలేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం చేసి పునరుద్ధరించారు. ఏది ఏమైనా ప్రజాధనం వృధా కాకుండా ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు.