పేదల గుండెల్లో సంక్షేమ భరోసా..

16-11-2026 | 05:02pm
  1. శ్రీరంగాపురంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్క్!
  2. 419 కుటుంబాలకు చేయూత.. రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పేదలకు అండగా ఎమ్మెల్యే

శ్రీరంగాపురం, నవంబర్ 16: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం.. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు(Benefits of welfare schemes) అందించడమే ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో పెడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Thudi Megha Reddy) స్పష్టం చేశారు.

సంక్షేమం మాటల్లో కాదు.. చేతల్లో చూపించడమే ప్రజా ప్రభుత్వ ప్రత్యేకతని ఆయన పేర్కొన్నారు. శ్రీరంగాపురం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్, డిజిటల్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీరంగనాయక స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

419 కుటుంబాలకు చేయూత.. పేదలకు భరోసా

శ్రీరంగాపురం మండలానికి చెందిన 419 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా వారి జీవితాల్లో భద్రతను పెంపొందిస్తాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

గత పదేళ్ల పాలనలో పేదలకు అన్యాయం.. కాంగ్రెస్‌తోనే సంక్షేమం

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించడంలో నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల అమలుతో పాటు పేదల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందన్నారు.

నాడు ఇందిరాగాంధీ నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

మహిళల సంక్షేమంపై కాంగ్రెస్ చిత్తశుద్ధి

మహిళల సంక్షేమం గురించి మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు తమ కుటుంబంలోని మహిళలకు న్యాయం చేయలేకపోయారని ఎమ్మెల్యే విమర్శించారు. మహిళలకు నిజమైన సంక్షేమం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, ఎన్నికల హామీల్లో భాగంగా తులం బంగారం అందించే పథకాన్ని కూడా రానున్న రోజుల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు.ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వరలక్ష్మి, ఎంపిడిఓ చెన్నయ్య, స్థానిక సర్పంచ్ మద్దిలేటి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విష్ణు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ శ్రీహరి రాజు,బిరం రాజశేఖరరెడ్డి వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు