ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత(District Collector K. Haritha) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
వృద్ధాప్య పింఛన్, ఆస్తి వివాదాలు, ఉపాధి, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, వ్యవసాయ భూములకు బావులు, బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు వినతులు అందజేశారు.
పిల్లల ప్రజావాణిలో పాఠశాలలకు నూతన భవనం, తాగునీరు, వంటశాల, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలని ఓ విద్యార్థిని అర్జీ సమర్పించింది. అందిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.