మేడిగడ్డకు ఏం కాలే!

04-11-2026 | 05:30am
  1. నీటిని ఎత్తిపోయకుంటే రైతు ఉద్యమమే 
  2.    85 పిల్లర్ల బరాజ్ చెక్కుచెదరలేదు 
  3. కాంగ్రెస్సే అబద్ధపు ప్రచారం 
  4. వృథాగా పోతున్న జలాలను ఎత్తిపోయాలి 
  5. ఎస్సారెస్పీ, నిజాం సాగర్‌లను నింపాలి 
  6. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి 
  7. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్‌ఎస్ బృందం

కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్(Medigadda Barrage) కూలిపోలేదని, 85 పిల్లర్లు నిటారుగానే ఉన్నాయని మాజీ మంత్రి, బాల్కొండ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బరాజ్ కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ(Congress Party), ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చేస్తున్న ప్రచా రం అబద్ధమని అన్నారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. గోదావరి నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను(Kannepalli Pumphouse) పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లారు. 

బరాజ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మాజీ మంత్రి వేముల మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బరాజ్ చెక్కుచెదరలేదని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించాలని కోరారు. గతంలో మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన బరాజ్‌లో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు.

కేవలం రెండు, మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, చేయించడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు పోతోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఎస్సారెస్పీ, నిజాంసాగర్ సహా ఇతర రిజర్వాయర్లన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు. 

దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కాంగ్రెస్ తీరు..

నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌటపల్లి హన్మంతరెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టుగా వ్యవహరిస్తున్నదని వేముల విమర్శించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇక్కడ వదిలేస్తుంటే, అక్కడ ఏపీలో చంద్రబాబునాయుడు కుప్పం వరకు నీటిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు.

తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంటే, మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పడం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాక్షస వైఖరిని వీడి మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని వేముల డిమాండ్ చేశారు.

తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్దఎత్తున రైతు ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ పర్యటనలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, పుట్ట మధు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్ రావు, ఎంకే ముజీబుద్దీన్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు