అదనపు కట్నం వేధింపుల ఆరోపణలు

21-11-2026 | 09:49pm

వివాహిత అనుమానాస్పద మృతి

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

బిచ్కుంద నవంబర్ (విజయక్రాంతి): అదనపు కట్నం(Additional dowry) కోసం భర్త, అత్తమామలు వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బిచ్కుంద మున్సిపాలిటీ(Bichkunda Municipality) గోపనపల్లి చెందిన మండోకర్ సురేఖ భర్త విఠల్ మూడు సంవత్సరాల క్రితం మృతి చెందగా, ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె మండోకర్ గిరీష్‌కు వీరేందర్ రాజుతో 06-02-2026న వివాహం జరిగింది.

వివాహ సమయంలో వరుడికి రూ.40 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, రూ.లక్ష విలువైన వెండి కట్న కానుకలుగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం అనంతరం కొంతకాలం సజావుగా సాగిన వైవాహిక జీవితంలో, ఆ తర్వాత అదనపు కట్నంగా రెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలని భర్త వీరేందర్ రాజు, అత్తమామలు, ఆడపడుచు కలిసి మానసికంగా, శారీరకంగా వేధించినట్లు ఆరోపించారు. ఈ వేధింపులు భరించలేక గత రెండు నెలలుగా గిరీష్ పుట్టింట్లోనే ఉంటున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో శుక్రవారం నాడు సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఇంట్లో తలుపులు వేసుకుని చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంటనే వారు ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదనపు కట్నం వేధింపుల ఆరోపణలు, వివాహిత మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు