నల్లబోతున్న తెల్ల బంగారం

06-11-2026 | 05:05am

జమ్మికుంట, పెద్దపల్లి మార్కెట్లలో పడిపోయిన ధరలు

వ్యాపారుల సిండికేట్           

కరీంనగర్/జమ్మికుంట, నవంబరు 05 (విజయక్రాంతి): పత్తి(Cotton) రైతును ఈ సీజన్లో కష్టాలువెంటాడుతున్నాయి. అరకొర దిగుబడులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ధరల(Prices) పతనం మరింత ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా 9,250 రూపాయల ధర పలకగా.. ప్రస్తుతం ఆ ధర 8,830కి పడిపోయింది. కొద్ది రోజుల వ్యవధిలోనే క్వింటాలుకు 420 రూపాయలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం 8,830 నుండి 8200 రూపాయల వరకు వ్యాపారులు ధరలు చెల్లించారు.  పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు గత నెలతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ నెలలో క్వింటాల్ పత్తి ధర 9,000 కంటే ఎక్కువగా నమోదు కాగా, ప్రస్తుతం ధరలు పడిపోయి 8,000 నుండి రూ. 8,669 రూపాయల మధ్యన కొనసాగుతున్నాయి. కేవలం కరీంనగర్ జిల్లాలోనే ఈ సీజన్లో దాదాపు 46,000 నుండి 48,000 ఎకరాల్లో పత్తి సాగు అయింది.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో దాదాపు 2.50 లక్షల క్వింటాళ్ల పైగా దిగుబడి రావచ్చని అంచనా. ఉమ్మడి జిల్లాలోని నల్లరేగడి భూముల్లో, నీటి వసతి ఉండి తడులు అందించిన పొలాల్లో దిగుబడి ఫరవాలేదనిపిస్తున్నా, ఎర్రనేలల్లో సాగు చేసిన పత్తి పంటలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పత్తి ధరలు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో ఎకరానికి 10 నుండి 12 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాల్సి ఉండగా, ఈ ఖరీఫ్లో వర్షాలు సకాలంలో కురవకపోవడం, నీటి కొరత వల్ల దిగుబడి 5 నుండి 7 క్వింటాళ్లకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడి దాదాపు 40% నుండి 50% వరకు క్షమించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కాగా కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై సుంకాల ఎత్తివేతను పొడిగించడంతో ధరలు తగ్గాయని వ్యాపారుల అంటున్నారు. మార్కెట్కు పత్తి రాక పెరగడంతో, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఖరీదుదారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి, జమ్మికుంటతో పాటు పొరుగున ఉన్న వరంగల్ మార్కెట్ లోనూ ఇంచుమించుగా ఇదే రకమైన ధరల తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు