దీక్షా దివాస్ సభను విజయవంతం చేయాల
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, నవంబరు 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్(KCR) చేసిన పోరాటం, బీఆర్ఎస్(BRS) పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను(development and welfare programs) ప్రజలకు వివరిస్తూ ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివాస్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డివేణి మధు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు గ్రామాల్లో కనీస రోడ్డు సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉండేదని, తాగునీరు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించడంతో పాటు సాగునీటి వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్ సరఫరా వంటి పథకాలతో రైతులకు భరోసా కల్పించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి వసతులు మెరుగుపరిచామని, స్థానిక చెరువులను నింపి రైతులకు నీరు అందించామని పేర్కొన్నారు. దీక్షా దివాస్ సభను బావుపేటతో పాటు కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిల్లి మహేష్, కొత్తపల్లి పార్టీ మండల అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ పార్టీ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, బద్దిపల్లి సర్పంచ్ పెంచాల ఆంజనేయులు, తాండ్ర శ్రీనివాస్, జిల్లా మాజీ కో ఆప్షన్ సభ్యులు సాబీర్ పాషా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.