టేకు కలప మాయం!
- కల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఘటన
- ఐదు చెట్ల కలప ఏమైంది..?
- రూ.2 లక్షల విలువ గల కలప ఏమైందని అనుమానాలు
- అనుమతులు లేకుండానే నరికారా..?
- తరలింపుపై సమగ్ర విచారణకు డిమాండ్
కల్లూరు, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కల్లూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి(Kallur Mandal Parishad Development Officer) (ఎంపీడీవో) కార్యాలయ ప్రాంగణంలోని ఐదు టేకు చెట్లకు(Teak trees) సంబంధించిన కలప మాయమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.2 లక్షల విలువైన కలప ఏమైందన్న ప్రశ్నలు మండలంలో చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 120 నుంచి 150 అడుగుల మేర కలప తరలింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరికిన కలపను(Timber) మారుమూల గ్రామపంచాయతీకి(Gram Panchayat) రహస్యంగా తరలించినట్లు వస్తున్న ఆరోపణలు ఈ వ్యవహారంపై మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి.
అనుమతులు ఉన్నాయా?
ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోని ఐదు టేకు చెట్లను నరికేందుకు సంబంధిత అధికారుల అనుమతులు తీసుకున్నారా? నరికిన కలపను ఎక్కడికి తరలించారు? తరలింపునకు ఎవరు బాధ్యత వహించారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
వివరణ కోసం ప్రయత్నించినా..
ఈ ఘటనపై వివరణ కోరేందుకు తహసీల్దార్, ఎంపీడీవోలను చరవాణి ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఫోన్ ఎత్తలేదు. దీంతో వారి వివరణ అందుబాటులోకి రాలేదు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఫారెస్ట్ రేంజర్
ఈ వ్యవహారంపై అటవీశాఖ రేంజర్ స్పందిస్తూ.. విషయం తెలిసిన వెంటనే సంబంధిత చెట్లకు నంబర్లు వేయించామని, అందిన సమాచారంతో సిబ్బందిని పంపించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. వాల్టా చట్టం పరిధిలోకి వచ్చే అంశాలు ఉన్న ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, బాధ్యులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సమగ్ర విచారణకు డిమాండ్
ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే చెట్ల నరికివేత, కలప తరలింపు జరిగిందన్న ఆరోపణలపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు ఉన్నాయా? కలప తరలింపునకు సంబంధించిన రికార్డులు ఏమిటి? కలప ప్రస్తుతం ఎక్కడ ఉంది? అనే అంశాలను వెలుగులోకి తీసుకువచ్చి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు.