బెజ్జూర్ కేజీబీవీ పీటీ మేడమ్‌ను తక్షణమే తొలగించాలి
బెజ్జూర్ నవంబర్ 18 (విజయ క్రాంతి): స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ(Kasturba Gandhi Balika Vidyalaya) (కేజీబీవీ ) బాలికల హాస్టల్లో పనిచేస్తున్న పీటీ చెంచు లక్ష్మిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ ) మండల అధ్యక్షుడు విశ్వంత్ గౌడ్ డిమాండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్న ఆమెపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీటీ లక్ష్మి హాస్టల్లోని విద్యార్థినులతో అసభ్యకరమైన రీతిలో చాట్స్ చేస్తున్నారని, చదువుకోవాల్సిన వయసులో వారి దృష్టిని మళ్లించి అసభ్యకరమైన వాటికి అలవాటు చేస్తున్నారని ఏబీవీపీ ఆరోపించింది. ఆమె ప్రవర్తన కారణంగా చిన్న వయసులోనే పిల్లల ఆలోచనా విధానం (మైండ్‌సెట్) దారి తప్పుతోందని, విద్యార్థినులు తీవ్ర మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు.
విద్యాబుద్ధులు నేర్పి పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయురాలే, ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న సదరు పీటీ పై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రానున్న కొద్ది రోజుల్లో సదరు పిటి ని విధుల నుంచి పూర్తిగా తొలగించకపోతే, ఏబీవీపీ బెజ్జూర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అమాయకులైన బాలికలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఎంతవరకైనా సాగుతుందని ఏబీవీపీ నాయకులు స్పష్టం చేశారు.