4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం
గొల్లకొండలో సింక్రనైజేషన్ కార్యక్రమం.. రైతులకు ఆర్థిక ప్రయోజనాలు, గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి అవకాశాలు..
ఆలేరు, నవంబర్ 16 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొల్లకొండ గ్రామంలో(Gollakonda Village) 4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు(Solar Power Project) సింక్రనైజేషన్ కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సిరి ఎనర్జీ అండ్ కార్బన్ అడ్వైజరీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకం కింద 2 మెగావాట్లు + 2 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TGSPDCL యాదాద్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సురేష్, భువనగిరి డివిజనల్ ఇంజనీర్ ఎస్. వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని, భవిష్యత్తులో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో సోలార్ విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులు సౌర విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములై ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గొల్లకొండ గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి అనుసంధానమైన ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక విద్యుత్ వ్యవస్థకు అదనపు విద్యుత్ అందుబాటులోకి రానుంది.
పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ఈ ప్రాజెక్టు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ పనులు, నిర్మాణ బాధ్యతలను తిరుమల ఎలక్ట్రికల్ వర్క్స్ కాంట్రాక్టర్ పారునంది భాస్కర్ చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.