చెకుముఖి టాలెంట్ విజేతలకు బహుమతులు

28-11-2026 | 07:52pm

మహబూబాబాద్: స్థానిక ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్లో(RC Convention Center) జనవిజ్ఞాన వేదిక మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకిముఖి సైన్స్(District-Level Chekimukhi Science) సంబరాలు జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మండలస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాకాతంగౌడ్ అధ్యక్షతన ప్రారంభ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నాయకులు, అలువాల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

జన విజ్ఞాన వేదిక మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నదని,  తన కార్యకలాపాలను విద్య, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేషంగా కృషిచేస్తుందని, దొంగ బాబాల గురించి, కృత్రిమ పానీయాలు వలన కలిగే నష్టాలు, చేప మందు కాదు అని, నిరూపించిన ఘనత జన విజ్ఞాన వేదికదని, దాన్ని చేప ప్రసాదం అని ఇప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నారని, దేవుడు, కులం, మతం, సాంప్రదాయం వ్యక్తిగతంగా చూస్తందని, దానికి మాకు పేచీ లేదని, సమాజం కోసం ఏది హితమో దానిని నిష్పక్షపాతంగా  తెలుపుతుందని, మహబూబాబాద్ జిల్లా కమిటీ చేసే కృషి నిజంగా రాష్ట్ర స్థాయిలో మాదిరిగా పనిచేస్తున్నదని, అందుకు అభినందనలు తెలియజేశారు.

జిల్లా గౌరవ అధ్యక్షులు బి .నెహ్రూ రాథోడ్ మాట్లాడుతూ, జన విజ్ఞాన వేదికను మిగతా సంస్థల మాదిరిగా కాకుండా భిన్నంగా చూడాలని, ఏ లాభాపేక్ష లేకుండా విశేషంగా కృషిచేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఇంకా బాగుంటుందని, ప్రభుత్వ ప్రోత్సాహం గురించి అధికారులు ఆలోచించాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సైన్స్ అధికారి అప్పారావు పరీక్ష పేపర్లు లాంచనంగా తెరిచి పరీక్షలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సమాజం హితంకోసం జనవిజ్ఞాన వేదిక చేపట్టే కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. విద్యార్థులలో శాస్ర్తీయ దృక్పథం కలిగించేందుకు చేసే ప్రయత్నమే చెకిముకి సైన్స్ సంబరాలని, ఎంతో చెమటోడ్చి ఆర్థిక, హార్దిక సహకారాలు అందజేస్తున్నారని అందుకు అభినందనలు తెలియజేశారు. ప్రజలు వారి సేవలను గుర్తించి ఉపయోగించుకోవాలని సూచించారు. 

పరీక్ష అనంతరం ముగింపు సమావేశం నిర్వహించారు. ఆర్. సీ.కన్వెషన్ అధినేత, ప్రముఖ దంతవైద్య నిపుణులు, డాక్టర్ అనిల్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జనవిజ్ఞాన వేదిక మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు చెకుముఖి సంబరాలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అనిల్ గుప్త, జి.వి.యల్ జ్యువెలర్స్ అధినేత విజయ్ చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు.

జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలల విభాగం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిన్న గూడూరు విద్యార్థులు, రెసిడెన్షియల్ విభాగంలో టి.జి. మోడల్ స్కూల్ విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల విభాగం నుంచి వివేకవర్ధిని హైస్కూల్, కేసముద్రం విద్యార్థులు ఎన్నికయ్యారు. డిసెంబర్ లో హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి సంబరాల్లో పాల్గొంటారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు సాహితీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆగుర్తి సురేష్, కోశాధికారి యు. శ్రీనివాసులు, జిల్లా చెకిముఖి కన్వీనర్ నవీన్, సీనియర్ నాయకులు బ్రహ్మం, నాగయ్య, మంగపతిరావు, ఆర్.వి ప్రసాద్, కృష్ణ ప్రసాద్, చొప్పరి శ్రీనివాస్, జె.యాకయ్య, ఆర్.యాకయ్య, పి.సాంబయ్య‌‌‌, టి. సునిత, ఆర్. సునిత, రామకృష్ణ, సాబీర్, ఓం ప్రకాష్, రాము, రామ్మోహన్, యాకయ్య , సుభాన్ , గైడ్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు