బాలికల రక్షణ, భద్రతకు పోలీసు ‘భరోసా'

28-11-2026 | 08:22pm

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ పీ. శబరిష్(SP Dr. P. Sabarish) ఆదేశాల మేరకు శనివారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ  బాలికల జూనియర్  కళాశాల(Government Junior College for Girls)లో భరోసా టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, ఫోక్సో చట్టం, సైబర్ నేరాల నివారణ, భరోసా సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికల రక్షణ, భద్రతకు, ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా భరోసా కోసం పోలీసులను సంప్రదించాలని భరోసా టీమ్ ఎస్ఐ వీ. దీపిక విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఫేక్ అకౌంట్లు, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ వేధింపులు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏహెచ్‌టీయూ సిబ్బంది మానవ అక్రమ రవాణా నివారణలో తమ పాత్రను వివరించారు. భరోసా కేంద్రం సిబ్బంది లైంగిక వేధింపులు, బాలలపై జరిగే నేరాల బాధితులకు అందించే న్యాయ, మానసిక, వైద్య సహాయ సేవల గురించి వివరించారు. మహిళలు, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎలాంటి వేధింపులు లేదా అనుమానాస్పద సంఘటనలు ఎదురైనా వెంటనే షీ టీం లేదా పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పొక్కుల. సదానందం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీలు పాల్గొన్నారు. భరోసా కేంద్రం సిబ్బంది కౌన్సిలర్, కోఆర్డినేటర్  జ్యోష్న, లీగల్ సపోర్ట్ పర్సన్ శ్వేత, షీ టీం సిబ్బంది ప్రియాంక, ఏహెచ్‌టీయూ  సిబ్బంది అరుణ, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు