లైంగిక వేధింపుల నివారణపై అవగాహన అవసరం
- బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
- జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కవిత
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): బాలలపై జరిగే లైంగిక నేరాలను(Sexual crimes) అరికట్టడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కళాశాలల యాజమాన్యాలు, సంబంధిత అధికారుల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి.కవిత(District Legal Services Authority Secretary G. Kavitha) అన్నారు. బాలల రక్షణ వ్యవస్థలు, లైంగిక వేధింపుల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. పిల్లలు తమకు ఎదురయ్యే అనుచిత ప్రవర్తనను గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. బాలలకు సురక్షిత వాతావరణం కల్పించడం, వారి హక్కులను కాపాడటం, వారిపై జరిగే నేరాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 9న జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. 1987 నవంబర్ 9న న్యాయ సేవా అధికార సంస్థల చట్టం అమల్లోకి వచ్చిందని వివరించారు. ఈ చట్టం ద్వారా అర్హులైన వారికి ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించడంతోపాటు లోక్ అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందించడమే న్యాయ సేవా అధికార సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయడంతోపాటు న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఉచిత సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఉచిత న్యాయ సలహాలు, సహాయం కోసం జాతీయ టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.డి.సంధాని, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రొడ్డ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.