బియ్యం అవుట్ లెట్ లను ప్రారంభించిన కలెక్టర్
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ లలో శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ రైస్ డిపో, దేవుడా రైస్ డిపో వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బియ్యం విక్రయ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా పౌర సరఫరాల అధికారి వేణుగోపాల్, తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ లతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 కిలోల బరువుతో కూడిన బి.పి.టి. కొత్త బియ్యం బ్యాగ్ ను 1,430 రూపాయలకు, బి.పి.టి. స్టీమ్ బియ్యం 1,612 రూపాయలు, హెచ్.ఎం.టి. స్టీమ్ బియ్యం 1,898 రూపాయలు, హెచ్.ఎం.టి. పాత బియ్యం బస్తా 1,976 రూపాయలు, జె.ఎస్.ఆర్. పాత బియ్యం 2 వేల 28 రూపాయల చొప్పున నిర్ణీత గరిష్ట ధరలకు విక్రయించాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
నిర్మాణ పనులను నిర్ణీత ప్రమాణాలతో, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులలో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ భోజనం అందించాలని, భోజనం నాణ్యత, వంటశాల పరిసరాలు, పరిశుభ్రత తదితర అంశాలను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు.
విద్యార్థినులకు నిర్ణీత మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని, ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి జి.ఓ. నంబర్ 76, 58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులు, భూ భారతి కార్యక్రమం, భూముల రీ-సర్వే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. జి.ఓ. నం. 58, 59 లకు సంబంధించిన దరఖాస్తుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు.
రీ-సర్వేకు సంబంధించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల క్రింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు మంజూరు చేసేందుకు అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.