గాంధీ, అంబేద్కర్ ఆశయాలతో మతోన్మాదంపై పోరాటం
జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : అంబేద్కర్, గాంధీజీల(Ambedkar, Gandhiji) ఆశయాలపై విషం చిమ్ముతున్న మతోన్మాదులను, మనువాదులను ఎదుర్కొనేందుకు జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పనిచేస్తోందని జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి అన్నారు. శనివారం మంచిర్యాలలో(Mancherial) అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం షాధిఖానలో ఏర్పాటు చేసిన జైభారత్ సామాజిక విప్లవ రణభేరి నాలుగవ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
మతోన్మాద సంస్థ ఆర్ ఎస్ ఎస్ అంబేద్కర్ పట్ల, వారి భావజాలం గోముఖ వ్యాఘ్రంలా ఉందని విమర్శించారు. వంద సంవత్సరాల అర్ ఎస్ ఎస్ చరిత్రలో 96 ఏళ్ళు బ్రాహ్మణుల చేతుల్లోనే అధికారం ఉందని, గోల్వాల్కర్ రాసిన దాంట్లో మైనార్టీలకు ఎలాంటి హక్కులు లేకుండా ఉండాలని, శూద్రులకు అన్ని రకాల అసమానతలకు గురిచేసిన మనుస్మృతి చాలా గొప్పదని, వారిని అణగదొక్కటానికి హిట్లర్ గ్యాస్ చాంబర్లతో మనుషుల్ని చంపిన విధానాన్ని స్పూర్తిగా తీసుకోవాలని చెప్పడం వారి దుర్మార్గమైన ఆలోచనకి ప్రతీక అని అన్నారు.
దేశ స్వాతంత్య పోరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ కి దేశ స్వాతంత్రానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. బ్రిటిషర్లకు తొత్తులుగా ఉన్న సంస్థ, హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా, అడ్డంగా నిలబడిన సంస్థ ఆర్ఎస్ఎస్, గాంధీ హత్యకు కారణమైన సంస్థ ఆర్ఎస్ఎస్ కాదా అని ప్రశ్నించారు.
దేశాన్ని మతంపేరిట చీలకుండా ఉండేందుకు చివరివరకు పోరాటం చేసిన ఏకైక వ్యక్తి గాంధీజీ అని జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, కులనిర్మూలన కోసం జీవితాంతం ప్రతి సందర్భంలోను కులాంతర వివాహాలు జరగాలని కోరుకున్న వ్యక్తి గాంధీజీ అని అన్నారు. అంబేద్కరిస్టులగా చెప్పుకునే మేధావులు గాంధీని కులవాదిగా ప్రచారం చేయడం దుర్మార్గమని, పచ్చి అబద్ధమని అన్నారు. అలాంటి వ్యక్తి ఆయన దేశానికి జాతిపీత మహాత్మా గాంధీ పై అబద్దాలతో.. వక్రీకరణలతో, విద్వేషంతో ప్రజలలో విషం నిప్పే ప్రయత్నాన్ని జైభారత్ అడ్డుకొంటుందన్నారు.
గాంధీ, అంబేడ్కర్ల ఆశయాలు సాధించడంతో పాటు మనువాదాన్నీ, మతోన్మాదాన్నీ అంతం చేయాలన్నారు. అలాగే దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గాంధీ, అంబేద్కర్ల పట్ల సమాజంలో ఉన్న అబద్ధాల చీకటి గోడలను బద్దలుకొట్టడానికి, వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలముందు పెట్టేందుకు, వారి ఆలోచన భావజాలాలతో జైభారత్ సామాజిక విప్లవ రణభేరి ఉద్యమిస్తోందన్నారు. అనంతరం విజయవిహారం రమణమూర్తి రాసిన రాజ్యాంగ రచన సభలో పాల్గొన్న విస్మృత దళిత ఆదివాసీ వీరులు జైపాల్ సింగ్ ముండా, కక్కున్ పుస్తకాలను ఆవిష్కరించారు.
సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షులు ఖదిజ్ఞాసి జీవన్ జోయెల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల స్వార్థానికి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ప్రతీఘాత విష శక్తుల పదాతి దళంగా మారవద్దన్నారు. రణభేరి ఉద్యమం ఎస్టీల హక్కులకై పోరాటం చేస్తుందని ప్రకటించారు. సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సైదయ్య
మాట్లాడుతూ నేటి సమాజానికి సామాజిక విప్లవ రణభేరి అవసరాన్ని వివరించారు. మహనీయుల మీద విషప్రచారాన్ని అడ్డుకోవాలనీ, దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారిగా వివిధ సామాజిక వర్గాల ఆర్థిక, సాంఘిక, విద్యా, ఉద్యోగపరమైన స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, మదింపు చేసే రీతిలో దేశవ్యాప్తంగా సమగ్రమైన కులగణన జరపాలని, చట్ట సభల్లో బీసీలకు , మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో రణభేరి జాతీయ సమన్వయ కమిటీ కన్వీనర్ ఖదిజ్ఞాసి లోక్ నాథ్, జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి రజనీ, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఖదిజ్ఞాసి మధు మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి గణేష్ గల్లా, బీసీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య, జ్వాల జాతీయ నాయకురాలు జీవన్ సెల్వరాణి, సీనియర్ బీసీ ఉద్యమకారులు కర్రె లచ్చన్న, క్రిస్టియన్ JAC రాష్ట్ర అధ్యక్షులు కాశి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.