బడ్జెట్ పాఠశాలల మనుగడను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవద్దు
- నూతన విద్యా విధానంపై స్పష్టమైన G.O. జారీ చేయాలి
- ఇంటర్ కళాశాలలకు 9, 10 తరగతులకు అనుమతి ఇవ్వరాదు
- TRSMA జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ప్రతిపాదించిన 10+2 విద్యా విధానాన్ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TRSMA) స్వాగతిస్తోందని సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు అన్నారు. బుధ వారం ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పూర్తయిన తర్వాత సుమారు 40 శాతం మంది విద్యార్థులు వివిధ సామాజిక,
ఆర్థిక కారణాలతో తదుపరి ఉన్నత విద్యకు దూరమవుతున్నారనే ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఆలోచన అభినందనీయమని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ నిర్ణయం సమర్థవంతంగా అమలయితే విద్యార్థులు చదువులో కొనసాగింపు పెరగడంతో పాటు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
అయితే 10+2 విద్యా విధానం అమలు పేరుతో ప్రస్తుతం ఇంటర్మీడియట్ కళాశాలలకు 9వ, 10వ తరగతులను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పదవ తరగతి వరకు నిర్వహిస్తున్న పాఠశాలలకు 11, 12వ తరగతులను విస్తరించుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఇంటర్మీడియట్ కళాశాలలకు 9, 10వ తరగతుల నిర్వహణకు అవకాశం కల్పిస్తే, ఇప్పటికే పరిమిత వనరులతో, తక్కువ ఫీజులతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న వేలాది బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం వల్ల చిన్న, మధ్యతరహా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాటు, వాటిపై ఆధారపడి జీవిస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉపాధికి కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం పదవ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపుతో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన విద్యా ప్రమాణాలు, భద్రతా నిబంధనలకు లోబడి, అనవసరమైన అదనపు ఆర్థిక భారం విధించకుండా 11, 12వ తరగతులను నిర్వహించేందుకు అఫిలియేషన్ మంజూరు చేయాలని కోరారు.
అయోమయంలో పది విద్యార్థులు...
ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 2027–28 విద్యా సంవత్సరంలో 11వ తరగతిని అదే పాఠశాలలో కొనసాగించవచ్చా? లేక ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలా? అనే విషయంలో స్పష్టత లేక అయోమయానికి గురవుతున్నారని ట్రస్మా జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు అన్నారు.
ఈ అనిశ్చితిని తొలగించేందుకు 10+2 విద్యా విధానం అమలు, పాఠశాలల అప్‌గ్రేడేషన్, అఫిలియేషన్, ప్రవేశాలు, పాఠ్యప్రణాళిక, పరీక్షల విధానం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రయోజనం చేకూర్చే విధంగా కాకుండా, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని సూచించారు.
విద్యా సంస్కరణల పేరుతో దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందిస్తున్న చిన్న, మధ్యతరహా ప్రైవేట్ పాఠశాలలు మూతపడే పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, తల్లిదండ్రుల ప్రయోజనాలు, అందుబాటు ఫీజులతో నాణ్యమైన విద్య, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని పేర్కొన్నారు.