గ్రామసభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు

10-11-2026 | 07:41pm

* 11 నుంచి డిసెంబరు 01 వరకు నిర్వహణ

* ఎల్‌నినో, ప్రత్యామ్నాయ పంటలు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ

పాపన్నపేట, నవంబరు 10: పాపన్నపేట మండలం(Papannapet Mandal)లోని 40 గ్రామ పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 11 నుంచి డిసెంబరు 01 వరకు ఆయా గ్రామాల్లో రోజుకు మూడు గ్రామసభల చొప్పున నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్బంగా గ్రామసభల్లో ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, జలసిరి పనులు, వీబీ-జీ రామ్ జీ పనులు, ఇందిరమ్మ ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించనున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యలపై సమీక్షించనున్నారు.

తొలిరోజు మూడు గ్రామాల్లో..

ఈ నెల 11న కొంపల్లి గ్రామంలో ఉదయం 10 గంటలకు, చీకోడ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, కొత్త లింగాయిపల్లిలో మధ్యాహ్నం 2 గంటలకు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇదే తరహాలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మిగిలిన గ్రామాల్లోనూ సమావేశాలు జరుగనున్నాయి.

అధికారుల హాజరు తప్పనిసరి

మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్, వ్యవసాయ అధికారి, పంచాయతీ అధికారి, సంబంధిత ఇంజినీరింగ్ శాఖల ఏఈలు, పశువైద్యాధికారి తదితర శాఖల అధికారులు గ్రామసభలకు హాజరు కావాలని ఆదేశించారు. సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది కూడా సమయానికి హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు