నాగ్సాన్‌పల్లి పాఠశాలకు స్కాలర్‌షిప్‌ల కీర్తి
* జేసీఐ ఇండియా ఫౌండేషన్‌కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక..
* ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం
పాపన్నపేట,నవంబర్10: గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభకు(Students' Talent) మరోసారి గుర్తింపు లభించింది. మెదక్ జిల్లా(Medak District) పాపన్నపేట మండలం నాగ్సన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు(Nagsanpally Zilla Parishad High School, Papannapet Mandal) చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిష్ఠాత్మక జేసీఐ ఇండియా ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌కు(JCI India Foundation Scholarship) ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. 2026 సంవత్సరానికి సంబంధించి జేసీఐ హైదరాబాద్ ఛాంపియన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాలర్‌షిప్ కార్యక్రమంలో 9వ తరగతి విద్యార్థులు గోకని భార్గవి, రియాజ్‌లు అర్హత సాధించారు.
ఈ విషయాన్ని జేసీఐ హైదరాబాద్ ఛాంపియన్ మేనేజర్ కిషోర్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంపికైన ఇద్దరు విద్యార్థులకు వన్‌టైమ్ స్కాలర్‌షిప్ కింద ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
చదువులో ప్రతిభ కనబరుస్తూ, ఆర్థికంగా వెనుకబడిన అనాథ విద్యార్థులు, సింగిల్ పేరెంట్ సంరక్షణలో పెరుగుతున్న పిల్లలను ప్రోత్సహించడమే ఈ స్కాలర్‌షిప్ ప్రధాన ఉద్దేశమని కిషోర్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి అందించే ఇటువంటి ప్రోత్సాహకాలు వారి ఉన్నత విద్యకు, భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఎంతో దోహదపడతాయన్నారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన భార్గవి, రియాజ్‌లు మరింత కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
గత మూడేళ్లుగా కొనసాగుతున్న ప్రోత్సాహం:
నాగ్సన్‌పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు మూడేళ్లుగా జేసీఐ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్, ఉపాధ్యాయులు అశోక్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ఆర్థిక చేయూత అందిస్తున్న జేసీఐ ఇండియా ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.