ఎంఎంసి కమిషనర్‌కు అఖిలపక్ష నాయకుల వినతి
18 ఏళ్ల సమస్యపై కదలిక..
ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంపై కమిషనర్ కీలక హామీ!
ప్రత్యామ్నాయ రహదారులు వెంటనే నిర్మించాలి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో గత 18 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే వంతెన నిర్మాణ సమస్యతో పాటు రహదారులు, టిడిఆర్ ల మంజూరు తదితర ప్రజా సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్ష నాయకులు శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కమిషనర్‌ను కలిసి ఘట్ కేసర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా నాయకులు ప్రధానంగా నాలుగు కీలక డిమాండ్లను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే వంతెన నిర్మాణ పనులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, వంతెన నిర్మాణ పనుల కారణంగా వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నారాయణ గార్డెన్ నుంచి ఎదులాబాద్ రోడ్డు మీదుగా లక్కీ వైన్స్ వరకు తక్షణమే రహదారి నిర్మించాలి.
ఘట్ కేసర్ కరీంగూడ చౌరస్తా నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వరకు రహదారి పూర్తిగా అధ్వానంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే నూతన రోడ్డు నిర్మించాలని, రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు ఎలాంటి జాప్యం లేకుండా న్యాయమైన పరిహారం, టి డి ఆర్ లు మంజూరు చేయాలని తదితర సమస్యలను తెలియజేశారు.
కమిషనర్ సానుకూల స్పందన
అఖిలపక్ష నాయకుల వినతిపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ ఇంత పెద్ద ప్రజా సమస్య 18 సంవత్సరాలుగా పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఘట్ కేసర్ ప్రజలు చేస్తున్న ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ఘట్కేసర్ బంద్, నిరసన కార్యక్రమాల వివరాలు ఉన్నతాధికారులు, సీఎంఓ దృష్టికి వెళ్లాయని వెల్లడించారు.
వంతెన నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడం, బాధితులకు పరిహారం అందకపోవడం వంటి అంశాలపై గత మూడు రోజులుగా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించినట్లు వివరించారు. త్వరలోనే సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి, అఖిలపక్ష నాయకులకు హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం వినతిపత్రం
ఇదే అంశాలపై మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి సైతం కమిషనర్ కి వినతిపత్రం పంపియడం జరిగింది. ఘట్ కేసర్ పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈసందర్భంగా అఖిలపక్ష నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పందించిన డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి, కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈకార్యక్రమంలో ఘట్ కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, సిపిఎం నాయకులు చింతల యాదయ్య, ఎన్. సబిత, కె. చంద్రమోహన్, జేఏసీ సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా, కొత్తకొండ వెంకటేష్, బచ్చు ప్రమోద్ గుప్తా, ఎండి సిరాజ్, అభిమన్యు తదితర అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.