బియ్యం దుకాణాల్లో తనిఖీలు

04-11-2026 | 05:05am

మేడ్చల్‌లోని కేపీఎన్ సూపర్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయం 

మేడ్చల్, నవంబరు 3 (విజయక్రాంతి): జిల్లాలో బియ్యం దుకాణాలలో(Rice shops) అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.’విజయక్రాంతి’దినపత్రికలో ’అధికారుల ఆదేశాలు బేఖాతరు’శీర్షిక వచ్చిన కథనానికి స్పందించి అధికారులు మేడ్చల్ పట్టణం కేఎల్‌ఆర్ కాలనీలోని కేపీ ఎన్ సూపర్ మార్కెట్లో పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దార్ శృతి(Deputy Tahsildar Shruti) ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు తేలింది. రూ.85,రూ.89, రూ.97 ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కే పి ఎన్ సూపర్ మార్కెట్ లిమిటెడ్ కంపెనీకి చెందినది. ఈ కంపెనీకి నగరంలో పలుచోట్ల బ్రాంచీలు ఉన్నాయి. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ధరలు తగ్గించి డిస్ప్లే చేస్తామని సిబ్బంది అధికారులకు తెలిపారు. మంగళవారం జిల్లాలోని పిర్జాదిగూడ, మల్కాజిగిరి, బోడుప్పల్, మేడ్చల్, మల్లంపేట్, బాలానగర్ లోని బియ్యం దుకాణాలు, సూపర్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించామని డిఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇప్పటివరకు పదిమందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. 

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి.. 

అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి 

దుకాణదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బిపిటి రూ 66, తెలంగాణ సోనా బియ్యం రూ.74, తెలంగాణ శ్రీరామ గోల్ రూ.79 ధరలకు విక్రయించాలని, ఈ ధరలు దుకాణంలో ప్రదర్శించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు