ఊరి బడి బలోపేతానికి కృషి చేయాలి
మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు
ఘట్ కేసర్, నవంబర్ 5 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 'మన బడులు-మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలకు పూర్తి స్థాయిలో రంగులు వేయించేందుకు సహకరించిన ఆయనను గురువారం గ్రామ పెద్దలు, నాయకులు, ఆర్గనైజేషన్ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు.
ఈ సందర్భంగా నందం గణేష్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా సూచించిందని, ప్రతి ఒక్కరూ తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ దాతల సహకారంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డక్కి రమేష్, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు, నాయకులు ముల్లి జంగయ్యయాదవ్, కొంతం లక్ష్మారెడ్డి, మందడి శ్రీనివాస్ రెడ్డి, మొలుగురం గణేష్, బొంత సుధాకర్, కొమ్మిడి శివ కృష్ణా రెడ్డి, ముత్యం రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆర్ . దాసు, లక్ష్మీ కల్పన, శివ కుమార్, ఆర్గనైజేషన్ సభ్యులు కే. రాజేందర్ రెడ్డి, రాజు, చెన్నయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.