విడాకుల వార్తలకు రమ్యకృష్ణ చెక్
టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ తన వైవాహిక జీవితంపై కొంతకాలంగా వినిపిస్తున్న వదంతులకు చెక్ పెట్టారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ఆమె విడిపోయారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమేనని, వృత్తిపరమైన కారణాలతోనే వేర్వేరు నగరాల్లో ఉంటున్నామని వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో (Podcast Interview) పాల్గొన్న ఆమె తొలిసారిగా తమ వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సోషల్ మీడియాలో తాను పెద్దగా యాక్టివ్‌గా ఉండనని, సినిమా, కెరీర్‌కు సంబంధించిన విషయాలు తప్ప వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా చర్చించడం తనకు ఇష్టం ఉండదని రమ్యకృష్ణ తెలిపారు. కృష్ణవంశీతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
"నేను, కృష్ణవంశీ ఇప్పటికీ భార్యాభర్తలమే. అయితే సంతోషంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. కెరీర్ పరంగా కొన్ని పరిస్థితుల వల్ల ఇలా ఉండాల్సి వస్తోంది. మా అబ్బాయి పుట్టిన సమయంలో నేను సీరియల్స్‌తో బిజీగా ఉండేదాన్ని. అప్పట్లో ప్రతి 15 రోజులకు ఒకసారి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించేదాన్ని. అలా నేను వచ్చి వెళ్లిన ప్రతిసారీ మా అబ్బాయి అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో మా అబ్బాయిని చెన్నైలోనే చదివించాలని కృష్ణవంశీతో చెప్పాను" అని ఆమె వివరించారు.
కాగా, రమ్యకృష్ణ, కృష్ణవంశీ 2003లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం కుమారుడి చదువు, తన కెరీర్ కారణంగా రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటూ సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు.
ఇలా ఇద్దరూ వేర్వేరు నగరాల్లో నివసిస్తుండటంతో కొంతకాలంగా వీరి వైవాహిక జీవితంపై అనేక ఊహాగానాలు (Divorce Rumours) ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు తెరపడినట్లయింది. తమ మధ్య ఉన్న అవగాహన, కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన అవసరాల కారణంగానే వేర్వేరుగా ఉంటున్నామని ఆమె స్పష్టం చేయడంతో విడాకుల ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది.