గిరిజన గూడాల చెంతకు కార్పొరేట్ వైద్య సేవలు
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
వైద్య శిబిరానికి విశేష స్పందన 4,500 మందికి పైగా హాజరు.
100 ఆసుపత్రుల భాగస్వామ్యంతో వైద్య సేవలు
ప్రజారోగ్య పరిరక్షణలో పోలీస్ శాఖ మానవీయ చొరవ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
ములుగు,(విజయక్రాంతి): మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు వారి ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు.
శనివారం గోవిందరావుపేట మండలం(Govindaraopet Mandal)లోని పీఎస్ఆర్ గార్డెన్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి(Mega Health Camp) రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మెగా వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం సంతోషకరమన్నారు. మారుమూల గ్రామాల నుంచి ప్రజలను వైద్య శిబిరానికి చేరవేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలు అందించేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా స్థాయి అధికారుల నుంచి ఎస్సైలు, కానిస్టేబుళ్ల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ వైద్య శిబిరం విజయవంతానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గతంలో ములుగులో అదనపు ఎస్పీగా పనిచేసిన సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. గంగారం, కొత్తగూడ గిరిజన ప్రాంతాల్లో సైతం ఆయన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో ములుగు జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ములుగు జిల్లాలోని పేదలు, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, 4,500 మందికి పైగా ప్రజలు తరలివచ్చారని పేర్కొన్నారు. దాదాపు 100 ఆసుపత్రులకు చెందిన వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది పాల్గొని క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. లక్షల రూపాయల విలువైన మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైతే హైదరాబాద్కు తీసుకెళ్లి చికిత్స అందించేందుకు శంకర్ ఐ హాస్పిటల్ ముందుకు వచ్చిందన్నారు. మెడికవర్ ఆసుపత్రి ద్వారా 1.50 కోట్లకు పైగా విలువైన ఉచిత వైద్య పరీక్షలకు సంబంధించిన 5,000 కూపన్లను అందజేసినట్లు తెలిపారు.
ములుగు జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్య నిపుణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలు విస్తరించి ఉన్న ములుగు జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన అనుమతుల సమస్యల కారణంగా మారుమూల గ్రామాల్లో రహదారులు, విద్యుత్, వైద్య సదుపాయాల కల్పనలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ క్రమం తప్పకుండా ఇటువంటి మెగా వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు గ్రామస్థాయిలో వైద్య శిబిరాలను కొనసాగిస్తామన్నారు.
జిల్లాలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీవో సహకారంతో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న సుమారు 300 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించినట్లు తెలిపారు. రాబోయే పోలీస్ నియామకాల్లో ములుగు జిల్లా యువత అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సహకారంతో ములుగు జిల్లాను ఇతర ప్రాంతాలకు దీటుగా సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ప్రకృతి సౌందర్యానికి, అటవీ సంపదకు నిలయమైన ములుగు జిల్లా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాబోయే మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు. అనంతరం దుంపిళ్లగూడెం–పసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మనన్ భట్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.