కొల్లాపూర్ గడ్డపై బీసీ రాజ్యాధికార నినాదం.. మల్లన్న సవాల్!
కొల్లాపూర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రావు, రెడ్లను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ రాజ్యాధికార పాదయాత్ర శనివారం కొల్లాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కత్తెర గుర్తుపై ఓటు వేసి బీసీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వబోమని శపథం చేశారు.బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధుల్లో సుమారు రూ.120 కోట్లను దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు 1,26,935 ఉండగా, రెడ్డి సామాజికవర్గ ఓట్లు సుమారు 11 వేలేనని పేర్కొంటూ, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల ఉద్యోగావకాశాలను అగ్రవర్ణాల ఆధిపత్యం దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్ యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.