వాలీబాల్ టోర్నీలో కోహెడదే పైచేయి

18-10-2026 | 10:24am

కోహెడ, అక్టోబర్ 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో కోహెడ జట్టు విజేతగా (Winner) నిలిచింది. కోహెడ జట్టు రూ.10 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీని కైవసం చేసుకుంది. రాయపోలు మండలం వడ్డేపల్లి జట్టు రన్నరప్‌గా (Runner-up) నిలిచి రూ.5 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందుకుంది.

గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి చేతుల మీదుగా విజేత, రన్నరప్ జట్లకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు.ఈ సందర్భంగా గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తును నిర్ణయించే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. ఎలాంటి దురలవాట్లకు లోనుకాకుండా సామాజిక స్పృహతో వ్యవహరించాలని ఆకాంక్షించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పొన్నాల లక్ష్మణ్, సంకల్ప సేవ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తిప్పారపు నాగరాజు, డాక్టర్ సీహెచ్. దయాకర్, రాజశేఖర్, రాహుల్ చారి, రఘు, అవినాష్, వంశీ, నోమన్, అంజి, మనీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు