ఐడీఓసీలో బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐడీఓసీ (IDOC) కార్యాలయ ఆవరణలో శనివారం బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ శాఖ, మున్సిపాలిటీలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మెప్మా, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళా అధికారులు, ఉద్యోగులు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, కోలాటాలతో సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతిని, పూలను, మహిళలను గౌరవించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విధుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు, పరస్పర స్నేహభావం, ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. పండుగ రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి అనూష, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట పుల్లయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.