చిట్యాలలో దొంగతనం కేసు ఛేదన
22-11-2026 | 09:27pm
చిట్యాల, నవంబర్ 22 (విజయక్రాంతి): చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.5 లక్షల నగదు, 2.5 గ్రాముల బరువున్న ఒక జత బంగారు చెవి కమ్మలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నార్కట్‌పల్లి సీఐ సిరికొండ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరడ గ్రామంలో ఈ నెల 16వ తేదీన తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు(Investigation) చేపట్టారు. ఈ కేసులో కడారి రాఘవేంద్ర (24), తండ్రి మల్లేష్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.
నిందితుడి వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, 2.5 గ్రాముల బరువున్న ఒక జత బంగారు చెవి కమ్మలు, హోండా స్ప్లెండర్ ద్విచక్ర వాహనం (నంబర్ ఏపీ 24 ఏడీ 3065) స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో భాగంగా పోలీసులు పక్కా సమాచారంతో చర్యలు చేపట్టి నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ సిరికొండ సురేష్ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనాల నివారణకు పోలీసు శాఖ పటిష్టమైన నిఘా(Surveillance) ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు తమ ఇళ్లలో, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను భద్రపరుచుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కట్‌పల్లి సీఐ సిరికొండ సురేష్, చిట్యాల ఎస్ఐ వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కోటి మధు, పోలీసు కానిస్టేబుళ్లు నాగరాజు, ఆనంద్, వెంకన్న, జాన్ రెడ్డి, గణేష్ తదితరులు ఈ కేసు ఛేదనలో పాల్గొన్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.