మాజీ కార్పొరేటర్ వసూళ్ల రాణి

22-11-2026 | 09:26pm

- బీఆర్ఎస్ నాయకురాలు పద్మా నాయక్ 

- కాంగ్రెస్ నాయకులు స్థాయిని మించి మాట్లాడుతున్నారు 

ఎల్బీనగర్, నవంబర్ 22 : కాంగ్రెస్ నాయకులు స్థాయిని మించి మాట్లాడుతున్నారని, హస్తినాపురం మాజీ కార్పొరేటర్ సుజాతా నాయక్ వసూళ్ల రాణిగా పేరుందని, ఆమె కూడా ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ పద్మా నాయక్(BRS leader Padma Nayak) ధ్వజమెత్తారు. ఆదివారం ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నీకు బీఫామ్ ఇచ్చి, కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పిస్తే, నీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారాలని విమర్శించారు. 

మూడున్నర సంవత్సరాల రాజకీయ జీవితంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరిన చరిత్ర నీది అని మండిపడ్డారు.  నీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నమ్మకాన్నే వమ్ము చేసిన నువ్వా సుధీర్ అన్న గురించి మాట్లాడేది? అన్నారు. విమర్శలు చేసే ముందు నీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో...‌నువ్వు కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు ఎవరమ్మా వసూళ్లు చేసింది?,  రెండు, మూడు సార్లు నిన్ను, నీ పీఏను వసూళ్లు మానుకోండి అని సుధీర్ రెడ్డి మందలించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

మీ వసూళ్ల దందా ఆపకపోవడంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది నిజం కాదా? ప్రశ్నించారు. పాపం.. మీ భర్త రాంచందర్‌ను కొట్టింది నువ్వా? నీ పీఏ నా? ముందు వీటిపై జనాలకు సమాధానం చెప్పండి అన్నారు.  గతంలో నందనవనం ఖాళీ స్థలంలో షెడ్లను తొలగించి, ఇప్పుడు నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఇండ్లు ఇప్పిస్తానని  చెప్పి రూ.5 లక్షలు తీసుకున్నావని ఆరోపించారు.‌ ఇప్పటికైనా సుజాత నాయక్ పిచ్చి మాటలు ఆపాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సత్యంచారి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, నాయకురాలు రమాదేవి, దీపాచావన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు