మళ్లీ ఓటమే

14-10-2026 | 05:30am
  1. వరుస పరాజయాలపై ఆత్మ పరిశీలన చేసుకో 
  2. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీ పార్టీ ఓడుతున్నది 
  3. చొరబాటుదారులను రక్షించేందుకే ఈసీపై ఆరోపణలు 
  4. త్రిపురలో బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు పెడితే ఎందుకు గెలువలే? 
  5. రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ‘సర్’(SIR), ఎన్నికలపై ఆరోపణలు చేయడం మానుకొ ని, వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతున్నదో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సూచించారు. కాంగ్రెస్‌లో రాహుల్(Rahul) ఎదుగుతున్న కొద్దీ ఆ పార్టీ ఓడిపోతున్నదని, ఇప్పటికే వరుసగా మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Election) ఓటమిని మూటగట్టుకుందని ఆయన విమర్శించారు. నాల్గోసారి కూడా ఓడిపోబోతున్నదని వ్యాఖ్యానించారు.

చొరబాటుదారులను రక్షించేందుకే రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తమ ఓటమికి ఈవీఎంలే కారణం అంటున్నది. బ్యాలెట్ పేపర్ తేవాలంటున్నది. ఇటీవల త్రిపురలో స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌తోనే జరిగినా ఆ పార్టీ గెలవలేకపోయింది.  ఈవీఎంల వల్లే బీజేపీ గెలుస్తుందనే వాళ్లు వీటికి సమాధానం చెప్పాలి’ అని ఆయన నిలదీశారు.

ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవలేకపోయిందని, ఆ బాధతోనే మళ్లీ బ్యాలెట్ బాక్స్‌ల జపం అందుకున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల నిర్వహణపై రాహుల్ గాంధీ సహా ఇండీ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను అమిత్ షా మంగళవారం ఖండించారు. 

మీ ఎదుగుదల.. మీ పార్టీ ఓటమి..!

‘కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడిగా, అధ్యక్షుడిగా, లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ ఎదుగుతూ వస్తున్నారు. ఆయన అలా ఎదిగిన కొద్దీ ఆ పార్టీ ఓడిపోతూనే ఉంది. ఇప్పటికే మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయింది. 2029లో జరిగే ఎన్నికల్లో మరో ఘోర పరాజయానికి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉండాలి. ఎన్డీయే భారీ మెజార్టీతో గెలవబోతున్నది’ అని అమిత్ షా సూచించారు. బీజేపీకి, మోదీకి ఉన్న ప్రజాదరణను ‘సర్’కు ముడిపెట్టాలని ఇండీ కూటమి చూస్తున్నదని, తప్పుడు ఆరోపణలు చేయడమే వాళ్ల పని అని మండిపడ్డారు.

‘ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్న కీలక రాష్ట్రం (గుజరాత్)లో 41 ఏండ్లుగా ఒక్క ఎన్నికలో కూడా కాంగ్రెస్ ఎందుకు గెలవడం లేదు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? త్రిపురలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక 33 ఏండ్లు అవుతున్నది. పశ్చిమబెంగాల్‌లో 54 ఏండ్లు దాటింది. వీటి గురించి ఆలోచిస్తే మంచిది’ అని రాహుల్‌కు సూచించారు. 

తాజాగా పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్ఛేరిలో ఉప ఎన్నికలు జరిగినా ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేకపోయిందని, ఆ పార్టీని దేశ ప్రజలు తిరస్కరిస్తున్న కొద్దీ హస్తం పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోతున్నదని, అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘కాంగ్రెస్ స్థానమైన అసోంలోని నాగావ్‌లోనూ బీజేపీ అభ్యర్థి 1.42 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థికి 76 శాతం ఓట్లు వచ్చాయి. 1.22 లక్షల భారీ మెజారిటీతో ఆయన గెలిచారు. అదే రాష్ట్రంలోని రెజీనగర్‌లోనూ టీఎంసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి 75 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ పరాజయాలను భరించలేక కాంగ్రెస్ సహా ఇండీ కూటమి నేతలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. 

ఓటర్లతో కాంగ్రెస్‌కు సంబంధం తెగింది

ఎన్నికల నిర్వహణపై ఆరోపణలు చేయడం కంటే.. కాంగ్రెస్ తన ఓటములకు కారణాలు వెతుక్కుంటే, ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నిస్తే మంచిదని అమిత్ షా సూచించారు. ‘సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీకి ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను తీసుకొచ్చినంత మాత్రాన తానే దేశ ప్రజల గొంతునని రాహుల్ చెప్పుకుంటున్నారు. ఆయన ఒక్కటి గమనించాలి. దేశ ప్రజల గొంతు పల్లెల్లో, మారుమూల కోనల్లో, అడవుల్లో, నదీ తీరాల్లో వినిపిస్తుంది. అక్కడ ఆయన పార్టీకి ఆదరణ ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. ఓటర్లతో ఎప్పుడో కాంగ్రెస్‌కు సంబంధాలు తెగిపోయాయి’ అని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు