స్టాలిన్‌తో కుదరని బేరం.. కూటమికి షాక్!

29-11-2026 | 06:43pm

చెన్నై: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్(DMK leader M.K. Stalin) వైఖరి మార్చుకునేలా చేయాలని ప్రయత్నించిన ఇండియా కూటమి అగ్రనేతలకు ఆశించిన ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ తదితరులు ఆదివారం చెన్నైలో స్టాలిన్‌తో సమావేశమయ్యారు.

డీఎంకే బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలతో కలిసి రావాలని కోరారు. అయితే తమిళనాడు ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్టాలిన్ తన వైఖరిని స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తి కూడా డీఎంకే నిర్ణయంలో మార్పు తీసుకురాలేకపోయింది. చర్చల అనంతరం కూడా బిల్లుపై డీఎంకే మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

డీలిమిటేషన్‌పై అసలు పంచాయితీ ఇదే: లోక్‌సభ స్థానాలను పెంచే కేంద్ర ప్రతిపాదనలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని, రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. తమ ప్రధాన డిమాండ్లకు కేంద్రం ప్రతిపాదనలో చోటు దక్కడంతోనే బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్టాలిన్ పార్టీ చెబుతోంది. మరోవైపు 850 వరకు లోక్‌సభ స్థానాల పెంపు దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిణామంతో ఇండియా కూటమిలో ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. డీఎంకేతో పాటు మహారాష్ట్రలోని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కూడా కేంద్ర ప్రతిపాదనకు మద్దతు తెలిపే సంకేతాలు ఇవ్వడం ప్రతిపక్ష శిబిరానికి మరో సవాలుగా మారింది.

మరిన్ని వార్తలు