10-11-2025 09:33:06 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతమైన “జయ జయ హే తెలంగాణ” రచయిత అందెశ్రీ(Andesri passes away) ఆకస్మిక మరణ వార్త ఎంతో బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి ఇది తీరని లోటు అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన గీతం ప్రజలలో చైతన్యాన్ని రగిలించి, అందరినీ ఒక్కతాటి మీదకు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. ఆయన సాహితీ కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర గీతంగా “జయ జయ హే తెలంగాణ” ప్రకటించిన రోజున అందెశ్రీ కళ్లలో కనిపించిన ఆనందం, ఉద్విగ్నత నా మదిలో నేటికీ తారసపడుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయనతో పంచుకున్న ఆలోచనలు, అట్టడుగు వర్గాల కోసం కలసి చర్చించిన సంక్షేమ దృక్పథం ఎప్పటికీ మరువలేనివన్నారు. సాహితీ వనంలో మహా వటవృక్షం కూలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.