10-11-2025 12:33:41 AM
-ఇసుక కొరతతో నిలిచిన నిర్మాణాలు
-కామారెడ్డి జిల్లాలో ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
కామారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లకు జిల్లాలోఇసుక కటకట మొదలైంది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు ఇసుక మాఫియా అదిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారు. మంజీరా నీరు ప్రవహిస్తుండడంతో ఇసుక తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ఇసుకను తరలిస్తున్న మంటూ కొందరు అక్రమంగా పర్మిషన్లు తీసుకుని ఇసుకను తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేస్తున్నారు. మరోపక్క ఉన్నతాధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చురుకుగా చేపట్టాలని కోరుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక లభించక ఇండ్లను మధ్యలోనే నిలుపుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాదులో పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పనులు నిలుపుదల చేశారు. ఇసుక అధిక ధరలకు విక్రయిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని లబ్ధిదారులు తెలిపారు. ఇసుక అక్రమంగా తరలించి ట్రిప్పుకు 5000 నుంచి 6000 రూపాయలకు విక్రయిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. స్థానికా అధికారులతో కుమ్మక్కే ఇసుక దందా నిర్వహించే నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం మధ్యలోనే నిలుపుదల చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమంగా అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకొని లబ్ధిదారులకు తక్కువ ధరకు తీసుకొని ఇప్పించాలని కోరుతున్నారు.