హాస్టళ్లలో వసతులు కల్పించండి

07-05-2024 02:03:06 AM

చట్టప్రకారం వసతులుండాలి: హైకోర్టు 

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలు, వసతి గృహాల్లో మరుగుదొడ్లు, స్నానాల గదు లు, వంట గదుల వంటి  మౌలిక వసతులపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకర్టు ఆదేశించింది. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నందున మౌలిక వసతుల కల్పన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు ప్రభుత్వానికి జూన్ 10 వరకు సమయం ఇచ్చింది. ప్రభుత్వ హాస్టళ్లలో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు సౌకర్యాలు అందించడం లేదని హైదరా బాద్‌కు చెందిన కీర్తినేడి అఖిల్‌శ్రీ గురుతేజ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.

పిటిషనర్ తరఫున న్యాయ వాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభు త్వం తీసుకొచ్చిన విద్యాహక్కు, బాలల హక్కుల వంటి చట్టాల ప్రకారం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అదన పు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ప్రతివాదన చేస్తూ, ఇప్పుడు విద్యార్థులకు వేసవి సెలవులని, మౌలిక సమస్యలపై అధికారులు చర్యలు తీసుకుంటారని, గడువు కోరింది. విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.