01-05-2025 02:26:30 AM
దేశమంతటా జనగణనతో పాటే..
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: జనాభా లెక్కల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కులగణనను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కులగణనను కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకించిందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఆరోపించారు.
కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు కులగణనను రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. ప్రధా ని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం రాజకీయ వ్యవ హారాల క్యాబినెట్ కమిటీ సమావేశం అయింది. ఈ సమా వేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే రానున్న జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహిం చాలని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయిం చి నట్టు తెలిపారు. సమాజం ఆర్థికంగా, సామాజికంగా సాధి కరత సాధించడానికి అలాగే దేశం పురోగతి చెందేం దుకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ క్రమంలోనే కాం గ్రెస్ ప్రభుత్వాలపై అశ్వినీ వైష్ణవ్ తీవ్ర విమర్శలు చేశారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణనను ఎప్పుడూ వ్యతిరేకిం చాయి. కులగణనను క్యాబినెట్‌లో పరిగణించాలని 2010లో దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొ న్నారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకే మంత్రుల బృందం ఏర్పడింది. చాలా రాజకీయ పార్టీలు కులగణనను సిఫా ర్సు చేశాయి. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సామా జిక, ఆర్థిక, కులగణన పేరుతో ఒక సర్వే నిర్వహించాలని భావించింది.
కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కుల గణనను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నాయి. కులగణను ఆ పార్టీలు రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం జనాభా లెక్కల అంశం కేంద్ర ప్రభుత్వ జాబితాలోకి వస్తుంది. కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించడం కోసం సర్వేలు చేశాయి.
అయితే, ఇందులో కొన్ని రాష్ట్రాలు సర్వేను బాగానే చేసినప్పటికీ ఇంకొన్ని రాష్ట్రాలు మాత్రం రాజకీయ కోణంలో సర్వేను అపారదర్శకంగా నిర్వహించాయి’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఇలాంటి సర్వేలతో సమాజంలో సందేహాలు సృష్టించారని, మన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెడిపోకుండా ఉండేందుకు సర్వేలకు బదులుగా కుగగణనను జనాభా లెక్కల్లో చేర్చినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ విరించారు.
క్యాబినెట్ ఇతర కీలక నిర్ణయాలు
2025 సీజన్‌కు సంబంధించి చెరకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.355గా నిర్ణయించినట్టు కేంద్ర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్ట కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అలాగే పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు కేంద్రమంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా మేఘాలయలోని మావ్లింగ్‌ఖుండ్ నుంచి అస్సాంలోని పంచ్‌గ్రామ్ వరకు 166.80 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్‌ను హైబ్రీడ్ ఆన్యూటీ మోడ్ (హెచ్‌ఏఎం)లో రూ.22,84 కోట్లతో అభివృద్ధి చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
తెలంగాణ మోడల్‌గా నిలుస్తుంది
కులగణనలో తెలంగాణ మోడల్‌గా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో చేపట్టిన కులగణన బ్లూప్రింట్‌గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా లెక్కలతోపాటు కులగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ స్పందించారు.
ఈ విష యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విజన్‌ను స్వీకరించిందన్నారు. ‘కులగణన చేపడతామని మేము పార్లమెంటులో చెప్పాం. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని కూడా ఎత్తేస్తామని చెప్పాం.
ప్రధాని మోదీ కేవలం నాలుగు కులాలు మాత్రమే ఉండేవని చెప్పేవారు. అయితే ఇంతలో ఏం మారిందో తెలియదు. 11 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా కులగణన చేస్తామని ప్రకటించారు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తెలంగాణ, బిహార్ రెండు రాష్ట్రాలు కులగణను నిర్వహించాయని, అయితే ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉందన్నారు. తెలంగాణలో కులగణన పూర్తి పారదర్శకతతో జరిగిందన్నారు. ఈవిషయంలో తెలంగాణ మోడల్‌గా నిలుస్తుందని, ఇక్కడ అవలంభించిన విధానం బ్లూప్రింట్‌గా మారుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రభుత్వానికి మద్దతిస్తాం
కులగణన విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ అనుసరించిన విధానాన్ని అందించడం ద్వారా కులగణన విధివిధానాల రూపకల్పనలకు సహా యం చేస్తామని తెలిపారు. అయితే జనగణనను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కులగణన ద్వారా రిజర్వేషన్లు మాత్రమే కాకుం డా, కొత్త అభివృద్ధి నమూనాను తీసుకురావడమే తమ ధృక్పథమని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీల భాగస్వామ్యం ఎంత అనే విషయం కులగ ణన ద్వారా తెలుస్తుందన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించిన మరో అంశా న్ని లేవనెత్తారు. ఆర్టికల్ 15(5) ప్రకా రం బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని రాహుల్ గాంధీ కోరారు.