01-05-2025 12:08:53 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల శ్రమతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, దేశ నిర్మాణంలో వారి త్యాగం అమూల్యమని పేర్కొన్నారు. కార్మికుల శ్రమ, పట్టుదల, అంకిత భావాన్ని స్మరిస్తూ వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు.
కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ఇస్తుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు-2025 ని తర్వతలో తీసుకువస్తామని చెప్పారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.