calender_icon.png 1 May, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణే అడ్డంకి

01-05-2025 02:23:09 AM

  1. నత్తనడకన హైవే ప్రాజెక్టులు
  2. పలుచోట్ల భూములు ఇచ్చేందుకు ఒప్పుకోని రైతులు
  3. మార్కెట్ రేటు కంటే తక్కువ పరిహారం ఇస్తుండటమే కారణం
  4. భూసేకరణ పనుల ఆలస్యం.. అధికారులపై సీఎం సీరియస్

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంలో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. వివిధ కారణాలతో క్షేత్రస్థాయిలో ఏర్పడుతున్న ఇబ్బందుల ఫలితంగా భూసేకరణ ఎక్కడికక్కడ పెం డింగ్‌లో ఉంటోంది. ఫలితంగా హైవేల నిర్మాణంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.

పలు హైవే ప్రాజెక్టులకు భూసేకరణ ఆలస్యం వల్ల పనులు చేపట్టేందుకు ఇబ్బంది అవుతోందని ఇప్ప టికే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పేర్కొన్నారు.

అటవీశాఖ అనుమతుల జాప్యం కారణంగా సుమారు 10 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తాము వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రూ.4,891 కోట్లతో 233 కి.మీ మేర చేపట్టిన 7 హైవే ప్రాజెక్టులను ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. 

పెండింగ్ ప్రాజెక్టులు..

n ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం నుంచి వరంగల్, హైదరాబాద్ మీదుగా కొడంగల్ (రావులపల్లి) వరకు ఉన్న ఎన్‌హెచ్163 హైవే పరిధిలో హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు కు ఇరువైపులా ఉన్న పర్యావరణ ఇబ్బందుల కారణంగా పనులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నా యి. ఫలితంగా నగరం నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్, బీజాపూర్ వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

n మహారాష్ట్రలోని దౌండ్ నుంచి ఒడిశాలోని కోరాపుట్ వరకు ఉన్న ఎన్ హెచ్ 63 పరిధిలో నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో 131 కి.మీ మేర హైవే విస్తరణ పనులు సాగుతున్నాయి. 554 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా..206 హెక్టార్లకు ముసాయిదా అవార్డులు సిద్ధం చేశారు. మరో 287 హెక్టార్లకు అవార్డులు సిద్ధం చేయాల్సిఉంది. ఈ సెక్షన్‌లో పలుచోట్ల భూములపై కోర్టు కేసులు నడుస్తున్నాయి.

n నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్163జీ)ను ప్రత్యేక ఎకనామిక్

 


 కారిడార్ చేయాలనే తలంపుతో కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే ఈ హైవే పరిధిలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో సుమారు 280 కిమీ మేర గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు జరుగుతుండగా..1,394 హెక్టార్ల భూసేకరణ అవసరం కాగా..ఇప్పటివరకు 1,056 హెక్టార్ల భూసేకరణ మాత్రమే పూర్తయింది.

Fజగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మధ్య ఉన్న ఎన్‌హెచ్-563పరిధిలో హైవే విస్తరణ పనుల కోసం 250 హెక్టార్ల భూసేకరణకుగాను 211 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. మిగతా భూసేకరణ కోసం అధికారులు ప్రయత్ని స్తున్నారు.

Fరీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం కోసం 1,920 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా..1,689 హెక్టార్ల భూసేకరణకు అవార్డులు చేసి ఎన్‌హెచ్ అధికా రులకు పంపించారు. ఇంకా సుమారు 12శాతం భూసేకరణ పూర్తయితే ఒకేసారి మొత్తం పనులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. రూ.18,772 కోట్లతో చేపట్టే ఉత్తర భాగం పనులను త్వరగా చేపట్టాలని ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉపరితల కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీని కోరారు. 

భూసేకరణలో ప్రధాన ఇబ్బందులు..

ఇప్పటికే పంటసాగు చేస్తున్న భూములను భూసేకరణలో భాగంగా ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోవడం లేదు. కొన్ని చోట్ల పట్టాదారులు అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా మారింది. మార్కెట్‌లో ఎకరా ధర రూ.50లక్షల నుంచి రూ.4కోట్ల వరకు పలికేచోట భూసేకరణకు ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షలకు రైతులు, భూముల యజమానులు ఒప్పుకోవడం లేదు. ధర పెంచాలని కోరుతున్నారు. మరికొందరు భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. మరికొందరు రైతులు మాత్రం భూసేకరణకు ఒప్పుకుంటున్నా తమకు మరోచోట అంతేస్థాయిలో భూములు కావాలని కోరుతున్నారు. 

5న రాష్ట్రానికి 

కేంద్రమంత్రి గడ్కరీ

ఈ నెల 5వ తేదీన రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణను వేగవంతం చేస్తూ ఆయనతో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో చేపడుతున్న పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో భూసేకరణలో ఏర్పడిన ఇబ్బందులను తొలగించేందుకు సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భూసేకరణలో వెనకబాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.