01-05-2025 10:59:52 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): గ్రూప్-1 పిటిషన్లపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత 2 .15 గంటలకు విచారించనుంది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సురేందర్‌రావు, విద్యాసాగర్ వాదనలు వినిపించారు. వరుస హాల్ టికెట్లు ఉన్నవారికి ఒకే మార్కులు వచ్చాయని పిటిషనర్లు నిర్దేశిత సమయానికి ప్రొవిజినల్ మార్కుల జాబితా ఇవ్వలేదని ఆరోపించారు. 20 రోజుల తర్వాత తుది మార్కులు వెల్లడించిందని, ఈ నేపథ్యంలో అవకతవకలు జరిగాయని అనుమానం ఉందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.
మూల్యాంకన ప్రక్రియ గురించి టీజీపీఎస్సీని ధర్మాసనం అడిగింది. నిరుద్యోగులు గ్రూప్-1 కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఆలస్యం లేకుండా విచారణ ముగించాల్సి ఉందని తెలిపిన హైకోర్టు పేర్కొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను తెలుగులో రాసిన వారు ఎంత మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు? సమాధాన పత్రాలు దిద్దిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వారు ఎందరున్నారు? జవాబు పత్రాలను దిద్దినవారికి నమూనా జవాబు పత్రం (కీ) ఇచ్చారా? అని టీజీపీఎస్సీని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది.
తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల వారీగా పేపర్లు దిద్దేవారికి నమూనా జవాబు పత్రం(కీ) ఇచ్చారా? అని టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. మెయిన్స్ పరీక్ష వ్యాస రూపంలో జరుగుతుందని, దానికి కీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులు గతంలో కంటే ఎక్కువ మందే అర్హత సాధించారన్నారు. పేపర్లు దిద్దిన వారికి పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. పిటిషన్లు వేసినవారు నిరుద్యోగులు కాదని, ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులని టీజీపీఎస్సీ ఆరోపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఏకసభ్య ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.