05-07-2025 11:42:31 PM
ఇద్దరు మహిళా పర్యాటకులు మృతి..
వికారాబాద్ వండర్ నెస్ రిసార్ట్‌లో ఘటన..
వికారాబాద్ (విజయక్రాంతి): రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో చెరువులో పడవ బోల్తా పడి ఇద్దరు మహిళా పర్యాటకులు మృతిచెందగా, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన శనివారం వికారాబాద్ మండల(Vikarabad Mandal) పరిధిలోని సర్పంన్‌పల్లి ప్రాజెక్టులో శనివారం చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాలు హైదరాబాదులో స్థిరపడ్డాయి. శనివారం మధ్యాహ్నం నాలుగు కుటుంబాలకు చెందిన కొందరు వికారాబాద్ సమీపంలోని గోధుమ గూడ సమీపంలో ఉన్న వండర్‌నెస్ రిసార్ట్‌కు వచ్చారు. రిసార్ట్ నిర్వాహకులు ఎలాంటి సేఫ్టీ జాకెట్స్ లేకుండానే పడవలో రీతు కుమారి(55), పూనమ్ సింగ్ (54)తో పాటు మరో ఇద్దరు చిన్నారులను చెరువులోకి తీసుకెళ్లారు.
తిరిగి ఒడ్డుకు వస్తున్న క్రమంలో బోటు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు నీట మునిగి మృత్యువాత పడ్డారు. వారిని రక్షించేందుకు నీటిలో దూకిన వారి కుటుంబీకుడు పూనం కుమార్ నీట మునిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం పూనమ్‌కుమార్ వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరు చిన్నారులను స్థానికులు కాపాడారు.
అనుమతి లేని రిసార్టులు?
వికారాబాద్ చుట్టూ అనుమతులు లేని రిసార్టులు ఎన్నో కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చెరువులో బోటింగ్ నిర్వహిస్తూ పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుమతులు లేని రిసార్టులను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.