06-07-2025 12:56:31 AM
- ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ విజయోత్సవ సభలో ఠాక్రే సోదరులు
- 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు
- బాల్ ఠాక్రే చేయలేనిది దేవేంద్ర ఫడ్నవీస్ చేశారు
- ఏ భాషకు వ్యతిరేకం కాదు.. బలవంతంగా రుద్దాలని చూస్తే మా శక్తి చూపిస్తాం
- మమ్మల్ని ఎవరూ విడదీయలేరు.. స్థానిక ఎన్నికల్లో కలిసి బరిలోకి
- దమ్ముంటే బెంగాల్, తమిళనాడులో హిందీ అమలు చేయండి
- ఐక్యంగా మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని పడగొడతాం
ముంబై, జూలై 5: మహారాష్ట్ర రాజకీయాల్లో అద్భుత సన్నివేశం చోటుచేసుకుం ది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ఒకే వేదికను పంచుకున్నారు. మహా రాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు సం బంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శనివారం ముంబై వర్లీలోని ఎన్‌ఎస్‌సీఐ డోమ్‌లో ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ (ఆవాజ్ మరాఠీ చా) పేరుతో విజయోత్సవ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహా రాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కలిసి హాజరయ్యా రు. మహారాష్ట్ర హిందీ భాషకు వ్యతిరేకం కాదని, అయితే హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం మరాఠీలుగా చూస్తూ ఊరుకోమని, తమ శక్తి ఏంటో చూపిస్తామని ఠాక్రే సోదరులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్నేళ్లలో తమను ఒకచోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని.. చివరికి బాల్ ఠాక్రే సైతం చేయలేని పనిని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా చేశారని పేర్కొన్నారు. ఫడ్నవీస్ అనుకోకుండా తమను ఒకే వేదికపైకి తీసుకొచ్చారన్నారు. తమ ఇద్దరి భావాలు వేరైనప్పటికీ రాష్ట్ర ఐక్యత విషయంలో కలిసికట్టుగా పోరాడతామని తెలిపారు.
ఇకపై మమ్మల్ని ఎవరూ విడదీయలేరని.. కలసి ఉండటానికే వేదికపైకి వచ్చామన్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలతో సహా ముంబై పౌర సంస్థకు జరిగే ఎన్నికల్లో తామిద్దరం కలిసి పోటీ చేయనున్నట్టు వెల్లడిం చారు.
మొత్తంగా వేలాది మంది ఎంఎన్‌ఎస్, యూబీటీ కార్యకర్తల సమక్షంలో ఠాక్రే సోదరులు చేతులు కలపడంతో రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విజయోత్సవ సభ శివసేన ప్రధాన కార్యదర్శి సంజయ్ రౌత్ సహా రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యావే త్తలు, సంపాదకులు, మరాఠీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీకు అధికారం..మాకు ప్రజల అండ : రాజ్ ఠాక్రే
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీని ఉద్దేశించి ‘మీకు విధాన్ భవన్‌లో అధికారం ఉండొచ్చు.. మాకు రోడ్లపై ప్రజల అండ దండలున్నాయి’ అని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం ద్వారా మన పిల్లలు సరైన విషయాలు నేర్చుకొనే అవకాశం లేకుండా పోతుందని మోదీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.
దక్షిణ భారతదేశంలో ఎంద రో సినీ నటులు, రాజకీయ నాయకులు ఇం గ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ తమ మాతృభాషలైన తెలుగు, తమిళం వంటి భాషల విషయంలో ఎంతో గర్వంగా ఉంటారన్నారు. అన్ని రాష్ట్రాల్లాగే మహారాష్ట్ర నేతలకు, ప్రజలకు కూడా తమ భాషపై అభిమానం ఉంటుందన్నారు. తమకు హిందీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని.. ఏ భాష చెడ్డది కాదని.. అయితే హిందీని తమపై రుద్దే ప్రయత్నం ప్రారంభించారన్నారు.
తాము దానిని వ్యతిరేకించకపోతే వాళ్లు ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేస్తారని ఆరోపించారు. తమ పూర్వీకులు మరాఠా సామ్రా జ్యాన్ని ఎన్ని ప్రాంతా లకు విస్తరించినప్పటికీ అక్కడి వారిపై మరాఠీని బలవంతంగా రుద్దలేదని పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలపై త్రిభాషా సుత్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గడిచిన 20 ఏళ్లలో ఉద్ధవ్ ఠాక్రేతో వేదికను పంచుకోలేదు.. బాల్ ఠాక్రే చేయలేకపోయారు.. కానీ ఫడ్నవీస్ నిర్ణయం తమ ఇద్దరిని కలిపిందన్నారు. ఇకపై ఐక్యంగా ఉంటూనే మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని పడగొడతామని హెచ్చరించారు.
మరాఠాల హక్కు కోసం ఎంతవరకైనా: ఉద్ధవ్ ఠాక్రే
రాజ్ ఠాక్రేతో కలవడం ట్రైలర్ మాత్రమేనని.. అసలు కథ ముందుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కేంద్రంతో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిపై ఉద్ధవ్ మండిపడ్డారు. మరాఠీ భాషా గౌరవానికి తమ ఐక్యత కొనసాగుతుందన్నారు. ముంబై లో హిందీని మూడో భాషగా విధించే రెండు జీవోలను వెనక్కి తీసుకోవడాన్ని ప్రజల విజయంగా అభివర్ణిం చారు.
హనుమాన్ చాలీసా, జైశ్రీరాంలకు తాము వ్యతిరేకులం కాదు.. మరి మరాఠీతో సమస్య ఏంట ని ప్రశ్నించారు. దమ్ముంటే బెంగాల్, తమిళ నాడులో హిందీ అమలుకు ప్రయత్నిస్తారా అని సవాల్ చేశారు. పుష్ప లాగా తనకు గడ్డం లేకపోయినప్పటికీ.. మరాఠా హక్కుల విషయంలో మా త్రం తగ్గేదే లేదని ఠాక్రే సినిమా డైలాగ్‌తో అదరగొట్టారు. భాష కోసం గుం డాయిజం సహించమని ఫడ్నవీస్ అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఒక మరాఠీ వ్యక్తికి న్యాయం జరగకుంటే వాళ్లు తమను గుండాలుగా పిలుస్తున్నారని తెలిపారు. మరాఠాల హక్కుల కోసం తాము గూండాలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు.