06-07-2025 01:11:00 AM
- సోమాజిగూడ ప్రెస్‌క్లబ్.. రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి లేదా కేసీఆర్ గ్రామం చింతమడక
- వేదిక ఎక్కడైనా మాకు ఓకే
- సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిసవాల్
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): వ్యవసాయం, రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాలును స్వీకరిస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రక టించారు. 24 గంటల్లో చర్చకు రావాలంటూ ప్రతిసవాల్ విసిరారు.
8వ తారీఖున ఉదయం 11 గంటలకు హైదరాబా ద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ అయినా సరే.. లేదా సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి లేకుంటే బీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్ స్వగ్రామం గజ్వేల్ నియోజకవర్గంలోని చింతమడకలోనైనా చర్చించేందు కు తాము సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశా రు. సీఎం రేవంత్‌రెడ్డి స్థాయికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని, తానే చర్చకు వస్తానని వెల్లడించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తనను తాను నల్లమల పులి అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డికి నల్లమల తెలంగాణలో ఉందో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం బేసిక్ నాలెడ్జ్ లేనందువల్లే 72 గంటల సమయం ఇస్తున్నట్టు చెప్పారు.
తాము ప్రిపేరయ్యి రాలే దంటూ గతంలోనూ కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారన్నారు. రైతులకు ఎవరు మంచి చేశారన్న విషయంలో కొత్తగా చాలెంజ్‌లు తీసుకునేందుకు ఏమీ లేదన్నారు. నిజం తెలిసి ఒప్పుకొని వారినే రేవం త్‌రెడ్డి అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజాపాలన నడవటం లేదని, చంద్రబాబు కోవర్టయిన రేవంత్‌రెడ్డి పాలన నడుస్తుందని ఆరోపించారు.
గురువు కోసం తెలంగాణ నీటిని ఏపీకి తరలిస్తున్న రేవంత్‌రెడ్డి ముమ్మాటికి కోవర్టేనని పునరుద్ఘాటిం చారు. తెలంగాణలో పండించిన ఏ పంటను అడిగినా, సాగును పండగలా మర్చింది కేసీఆర్‌నని చెబుతాయన్నారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్, రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ను ఇచ్చిన ఏకైక సీఎం స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్ ఒక్కరేనన్నారు. ఇందిరమ్మ గొప్పదనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలన్న సీఎంకు కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడడమే ఇందిరమ్మ రాజ్యం అని తెలియదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మాకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, నిజంగానే ఆ పాత దుర్దినాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆధార్ కార్డు చూపిస్తే ఎకరాకు ఒక ఎరువుల బస్తా ఇవ్వాలని అధికారులకు చెప్పిన మాట నిజం కాదా ప్రశ్నించారు. ఎరువులను పంచడం కూడా చేతగాని రేవంత్‌రెడ్డి, కేసీఆర్ లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతో ఇవాళ మార్కెట్ యార్డులకు వచ్చిన ధాన్యాన్ని కొనకుండా పారిపోతున్నది మీ ప్రభుత్వం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
రైతు బీమా ప్రీమియం కట్టకుండా మూడు నెలల నుంచి సతాయిస్తూ రైతుల పాలిటీ శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో 90 శాతం పూర్తయి న పాలమూరు ఎత్తిపోతల పథ కం పనులు పూర్తి చేయకుండా మహబూబ్‌నగర్‌ను ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.
రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తుందని ఆరోపించారు. రాహుల్‌గాంధీతో వరంగల్‌లో చేపించిన రైతు డిక్లరేషన్‌లోని ఒక్క హామీనైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పూర్తయిన నియామకాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి తామే చేశామని రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టుకుంటున్నారని, ఇదే విషయం అశోక్ నగర్‌కు వచ్చి చెప్పే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
మొన్నటిదాకా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్ర కోసం పనిచేసిన ఆదిత్యదాస్‌ను తీసుకొచ్చి సాగునీటి సలహాదారుడుగా ఎవరైనా నియమిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. వంద అసెంబ్లీ సీట్లు గెలుస్తానని రేవంత్‌రెడ్డి పగటికలలు కంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా ఈసారి ఓటేయదన్నారు.
రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ మాత్రమే సంతోషంగా ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒక్క కొత్త స్కీము అమలు చేయలేదని, ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, కానీ ఇప్పుడు అప్పు రెండు లక్షల కోట్లకు చేరిందన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఖాతాల్లో టకీటకీమని డబ్బులు పడుతున్నాయని ఆయన ఆరోపించారు. పే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌కు తెలంగాణను ఏటీఎం లాగా మార్చారన్నారు.