గిరిజన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి
యూనిట్ అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, మార్చి 23, (విజయక్రాంతి): వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వివిధ వ్యక్తిగత సమస్యలు , ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి గిరిజన దర్బార్ లో దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన కుటుంబాలకు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో గిరిజన దర్బార్ ప్రారంభానికి ముందు సంబంధిత యూనిట్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం, వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి గిరిజన దర్బార్ లో వివిధ సమస్యల గురించి అర్జీలు సమర్పించడానికి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఏడిఎంహెచ్‌ఓ సైదులు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఏవో సున్నం రాంబాబు, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, డి టి ఎల్ టి ఆర్ నాగేశ్వరరావు, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోతి, ఏవో నరేందర్, హెచ్ ఈ ఓ లింగ నాయక్ మరియు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది వెంకటేశ్వర్, ఝాన్సీ, విజయ్ కుమార్ జోగారావు తదితరులు పాల్గొన్నారు.




