ట్రంప్ యూటర్న్
ఇరాన్‌తో చర్చల మంత్రం.. యుద్ధానికి ఐదురోజుల హాల్ట్
ఇరాన్‌లోని గౌరవప్రదమైన నేతలతో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్..
ఇదంతా ట్రంప్ కుట్రేనన్న ఇరాన్
అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టీకరణ
అమెరికా, ఇజ్రాయెల్ చిత్తుగా ఓడిపోయాయని ఎద్దేవా
ట్రంప్ ప్రకటనతో దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు
వాషింగ్టన్, మార్చి 23: హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తా మని 48 గంటల అల్టిమేటం జారీచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరుసటి రోజే మాట మార్చారు. ఇరాన్‌తో చర్చల మంత్రం జపిస్తున్నారు. మధ్యప్రాచ్యం లో యుద్ధానికి పూర్తి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని- సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న అన్ని రకాల దాడులను ఐదు రోజుల పాటు వాయిదావేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి సోమవారం ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది.
తమ దేశంపై దాడులకు ట్రంప్ భయపడ్డారని, అందుకే డ్రామా ఆడుతున్నారని, అదను చూసి మళ్లీ దాడులకు ప్లాన్ చేస్తున్నారని టెహ్రా న్ స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రకటనతో ముడిచమురు ధరలు తగ్గి, బ్రెంట్ క్రూడాయిల్ ధర తగ్గింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజులుగా సానుకూల, ఫలప్రదమైన చర్చలు జరిగాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇంకా ఐదురోజుల పాటు లోతైన, వివరణాత్మక, నిర్మాణాత్మక చర్చలను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న అన్ని రకాల సైనిక దాడులను వాయిదా వేయవలసిందిగా తమ బలగాలను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
ఇదంతా ట్రంప్ కుట్ర : ఇరాన్
ఇరాన్‌పై దాడులకు బ్రేక్ ఇచ్చామని, ఐదు రోజులు దాడులు చేయబోమని, పశ్చిమాసియా దేశాల్లో తాను శాంతికి కృషి చేస్తానన్న ట్రంప్ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అసలు ఎలాంటి చర్చలు జరగడం లేదని, ఇదంతా ఆయన ఆడుతున్న డ్రామా అని ఖండించింది. మళ్లీ అదును చూసి దాడులు చేయడానికి జరుగుతున్న కుట్ర అని ఇరాన్ ఓ ప్రకటనలో తెలిపింది. తమపై దాడులకు ట్రంప్ భయపడ్డారని, అమెరికా, ఇజ్రాయెల్‌లు చిత్తుగా ఓడిపోయాయని ఇరాన్ ఎద్దేవా చేసింది.
అమెరికాతో ఎలాంటి చర్చలూ జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సమయం చూసి మళ్లీ తమపై దాడులు చేసేందుకే ట్రంప్ ప్లాన్ చేశారని, ఆయన మాటలను నమ్మబోమని ఇస్లామిక్ రిపబ్లిక్ తేల్చిచెప్పింది. చర్చల విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించడం లేదని, అమెరికాతో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టంచేసింది.
హోర్ముజ్ జలసంధిపై మా వైఖరి మారలేదని, ఇరాన్‌పై దాడి చేస్తున్న దురాక్రమణదారులకు ఆ జలమార్గం మూసివేసే ఉంటుందని టెహ్రాన్ మీడియా తెలిపింది. ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ మాట్లాడుతూ.. ‘మా పోరాటం కొనసాగుతోంది. సైతానుకు ఇది మరో ఓటమి. ట్రంప్, అమెరికా మరోసారి విఫలమయ్యాయి’ అని పేర్కొన్నారు. తమతో యుద్ధంపై మరోసారి ట్రంప్ వెనక్కి తగ్గారని ఎగతాళి చేసింది.
చర్చలు నిజమే: ట్రంప్
అమెరికాతో గానీ, మధ్యవర్తుల ద్వారా గానీ ప్రత్యక్ష సంప్రదింపులు జరగలేదని ఇరాన్ ప్రకటించడంతో.. చర్చలు నిజంగానే జరుగుతున్నాయని, ఆదివారం రాత్రి కూడా అవి జరిగాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ తగిన ఒప్పందం కుదుర్చుకోవాలని తీవ్రంగా కోరుకుంటోందని ట్రంప్ చెప్పారని, ఇంధన కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేసినట్లు ఆయన ధృవీకరించారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. అమెరికా అధికారులు స్టీవ్ వైకాఫ్, జారెడ్ కుష్నర్ ఇరాన్‌కు చెందిన గౌరవ ప్రదమైన నేతలతో ఇటీవల చర్చలు జరిపారని ట్రంప్ తెలిపారు.
తగ్గిన క్రూడాయిల్ ధరలు
అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు అమాంతం దిగొచ్చాయి. సోమవారం ఉదయం 110 డాలర్లకు పైగా పలికిన బ్రెంట్ క్రూడాయిల్ ధర, ట్రంప్ ప్రకటన తర్వాత 96 డాలర్లకు తగ్గింది. ట్రంప్ ప్రకటించిన నిమిషాల్లోనే క్రూడాయిల్ 10 శాతానికి పైగా దిగివచ్చింది.




