10,000 కోట్ల సంక్షేమం
- ఏడాది కాలంలో అన్ని వర్గాల ప్రగతికి పెద్దపీట
- ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పథకాల రూపకల్పన
- బీసీలకు అత్యధికంగా 2,888 కోట్లు విడుదల
- ఎస్సీలకు 1,610 కోట్లు, ఎస్టీలకు 2,284 కోట్లు
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసింది. పేద, బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలను రూపొందించడంతోపాటు వాటి అమలులోనూ పారదర్శకత, చిత్తశుద్ధి చూపుతున్నది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా ఏడాది పాలనలో అన్ని సంక్షేమ శాఖలకు కలిపి దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నది. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు భారీగా నిధులను కేటాయించి అమలు చేస్తున్నది. ఈక్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు ఆసరాగా నిలుస్తున్నది.
ఏడాదిలో రూ.9,888 కోట్లు..
ప్రభుత్వం ఏడాది కాలంలో సంక్షేమ శాఖలకు సంబంధించిన పథకాల అమలు కోసం రూ.9,888 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో అత్యధికంగా బీసీ సంక్షేమానికి రూ.2,888 కోట్లు కేటాయించింది. ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.1,610 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.2,284 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.1,214 కోట్లు, మహిళా సంక్షేమ పథకాలకు రూ.1,892 కోట్లు ఖర్చు చేసింది. ఏడాదిలో ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం నిధుల్లో 17 శాతం సంక్షేమ పథకాలకే కేటాయించింది. తద్వారా ప్రజా సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రభుత్వం నిరూపించుకున్నది.
రాష్ట్రంలో 52శాతం బీసీలు..
సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేసినప్పటికీ ఆయా వర్గాల జనాభా ప్రాతినిధ్యం ప్రకారం నిధులు కేటాయింపు లేదని బీసీలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా సంక్షేమ శాఖలకు భారీగా నిధులు కేటాయించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. వారి మాదిరిగానే బీసీల జనాభాను దృష్టిలో పెట్టుకొని నిధుల కేటాయింపులో ప్రత్యేక స్థానం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో దాదాపు 52 శాతం బీసీ జనాభానే ఉన్నది. కానీ సంక్షేమానికి సంబంధించిన నిధుల కేటాయింపులో మాత్రం ఆ స్థాయిలో న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రత్యేక దృష్టి సారించి, జనాభా ప్రకారం నిధుల కేటాయించాలని కోరుతున్నారు.
సంక్షేమానికి శాఖల వారీగా ఖర్చు చేసిన నిధులు





