సీట్లు ఎక్కువ.. చేరికలు తక్కువ!
- డిగ్రీకి తగ్గుతున్న డిమాండ్
- కాలేజీల్లో భారీగా మిగులుతున్న సీట్లు
- 4.38 లక్షల సీట్లలో 2 లక్షలు కూడా నిండని సీట్లు
- రేపు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): డిగ్రీకి విద్యార్థుల్లో క్రేజ్ తగ్గుతోంది. దీంతో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. సీట్లు మిగిలేది కూడా వందలు, వేలు కాదు... లక్షల్లో మిగులుతుండడం గమనార్హం. మొత్తం ఐదు విడుతల్లో డిగ్రీ అడ్మిషన్లు చేపడుతున్నా సీట్లు మాత్రం నిండట్లేదు. విద్యార్థులు చేరేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రతి ఏటా సీట్లు భారీస్థాయిలోనే మిగులుతున్నాయి. కొన్ని కాలేజీల్లో ఒక్క సీటు కూడా నిండని పరిస్థితి.
అలాంటి కాలేజీలను ఈ 2026-27 విద్యాసంవత్సరంలో గుర్తించి ఆయా కాలేజీల్లోని కోర్సులను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేని ఓ కాలేజీలో 10-15 శాతం అడ్మిషన్లు నిండితే ఆయా కాలేజీల్లోని విద్యార్థులను సమీపంలోని కాలేజీలకు షిఫ్ట్ చేయనున్నారు. సీట్ల భర్తీ కోసం నాలుగైదు దఫాలుగా అడ్మిషన్లకు అవవకాశమిచ్చినా సీట్లు మాత్రం ఎం తకీ నిండడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గురుకులాలు, ప్రైవేట్, నాన్ దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) కాలేజీలు మొత్తం 967 ఉన్నాయి.
వీటిలో మొత్తం 4.38 లక్షల సీట్లున్నాయి. అందులోనూ కేవలం దోస్త్ పరిధిలోని 826 కాలేజీల్లో 3.77 లక్షల సీట్లుంటే అందులో 1,75,653 సీట్లు మాత్రమే 2025-26 విద్యాసంవత్సరంలో నిండాయి. అంటే గత విద్యా సంవత్సరం 2,01,347 సీట్లు ఖాళీగా మిగిలాయి.
నాన్ దోస్త్, ఇతర కాలేజీల్లో 36 వేల సీట్లకు దాదాపు 20 వేల సీట్లు నిండినా ఇంకా 15 వేల సీట్లు ఖాళీగానే ఉంటాయి. అంటే మొత్తం నిండుతున్న సీట్లు 2 లక్షలు కూడా లేవు. మొత్తంగా దాదాపు 2.42 లక్షల సీట్లు మిగులుతున్నాయి. ప్రైవేట్‌లోనే కాదు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు పూర్తిగా నిం డడంలేదు.
ఆసక్తి చూపని విద్యార్థులు
మొదటి నుంచి డిగ్రీ కోర్సుల్లో సీట్లు అత్యధికంగా మిగులుతున్నాయి. బీఎస్సీ, బీఏ, బీకామ్ కోర్సుల్లో ఒక్క బీకామ్ కోర్సు మినహాయిస్తే మిగ తా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు ఇష్టపడటంలేదు. డిగ్రీ చేసిన వారికి ఉపాధి అవకాశాలు తక్కు వగా ఉండడం, ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతరత్రా ఉపాధి అవకాశాలు, డిమాం డ్ ఉన్న కోర్సులవైపు విద్యార్థులు మక్కువ చూపిస్తుండటం దీనికి ప్రధాన కారణంగా చెప్పు కోవచ్చు.
ఈ క్రమంలోనే ప్రతి ఏడాది డిగ్రీలో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ సిలబస్‌ను ఎప్పటికప్పుడు తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్పులు చేర్పులు చేస్తున్నప్పటికినీ ఆశించిన స్థాయిలో సీట్లు నిండడంలేదు. నాలుగైదు విడుతల్లో డిగ్రీ సీట్లు నింపుతున్నా రెండు లక్షల సీట్లు నిండడమే గగనమవుతుంది. ఈసారైనా ఆశించిన స్థాయిలో సీట్లు నిండుతాయో లేదో చూడాల్సి ఉం టుంది.
నాన్ దోస్త్ కాలేజీలకు చెక్? రేపు దోస్త్ నోటిఫికేషన్
రాష్ట్రంలో నాన్ దోస్త్ కాలేజీలు 58 ఉన్నాయి. ఇందులో 46 ప్రైవేట్ కాలేజీలు కాగా, 12 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 36,637 సీట్లు ఉన్నాయి. అయితే ఈ సీట్లను దోస్త్ ద్వారా నింపకుండా ఆయా కాలేజీలే సొంతంగా భర్తీ చేసుకుం టున్నాయి. వీటిని కూడా దోస్త్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులు ఎప్పటి నుంచే ప్రయత్నిసు న్నారు. కానీ ఇది అమలు కావడంలేదు.
ఈ క్రమంలోనే ఈ కాలేజీలను కూడా దోస్త్ పరిధిలోకి తెచ్చేలా ప్రవేశ పరీక్షను పెట్టి అడ్మిషన్లు నిర్వహిస్తే ఎలా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అప్పుడు ఇంటర్ మార్కుల మెరిట్‌తో కాకుండా అడ్మిషన్లను ప్రవేశ పరీక్ష పెట్టి కౌన్సిలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేసే వీలుంటుంది. ఈసారైతే దోస్త్ ద్వారానే ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే 2026 విద్యాసంవత్సరానికి దోస్త్ నోటిఫికేషన్‌ను ఈనెల 13న విడుదల చేయనుంది.




