12 April, 2026 | 2:04 AM

నెక్లెస్ రోడ్డులో ఫుడ్ స్టాల్స్

08-12-2024 02:06 AM
  1. ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
  2. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో ప్రసిద్ధి చెందిన పలు బ్రాండెడ్ హోటల్స్ ఈ స్టాళ్లలో కౌంటర్స్ ఏర్పాటు చేశాయి.

హైదరాబాదీ బిర్యానీ, మొగులాయి వంటకాలు, చాట్, ఐస్ క్రీం, నార్తన్ తదితర వందకు పైగా స్టాళ్లను సందర్శకుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయంగా పేరొందిన హైద్రాబాదీ దమ్ బిర్యానీతో పాటు మొగలాయి, జఫ్రాని బిర్యానీ పర్యాటకులకు అందించేందుకు ప్రముఖ హోటల్స్ ప్యారడైజ్, పిస్తా హౌస్, షాదాబ్, బడేమియా కబాబ్ తదితర హోటళ్లు తమ బ్రాండ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

వీటితో పాటు తెలంగాణ వంటకాలుగా పేరొందిన పాలమూరు గ్రిల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటుకోడి చికెన్, ఫుడ్ జాయింట్స్ స్టాల్స్ కొలువుదీరాయి. నీలోఫర్ కేఫ్, బ్రౌన్ బేర్ బేకరీలు, ప్రాంకిల్ మ్యాగి హాట్‌స్పాట్ కాంటినెంటల్ కాఫీ, ప్రాంకి అండ్ రోల్స్, మొమోస్ అండ్ ప్రైస్‌తో పాటు గోకుల్ చాట్, ఆగ్రా చాట్ అండ్ స్వీట్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్లను కూడా స్టాల్స్‌లో ఉంచారు. 

ఆకట్టుకున్న సంగీత విభావరి 

హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను స్పీకర్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత విభావరితో పాటు పేరిణి నృత్యం, కూచిపూడి, భరత నాట్యం కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, సీఎస్ శాంతికుమారి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్, జీఏడీ ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.