ఇంధన భద్రతకు ఊతం
రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను అమెరికా మరోసారి సడలించింది. పశ్చిమాసియా ఉద్రికత్తలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సడలింపులను మరో 30 రోజులు పొడిగిస్తున్నట్టు అగ్రరాజ్యం ప్రకటించడం ముదావహం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒకవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడం, మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో రష్యా చమురు యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా భారత్‌కు గొప్ప ఊరటగా మారింది. పశ్చిమాసియా యుద్ధానికి పూర్వం 72 డాలర్లుగా ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర నేడు 105 డాలర్లకు చేరడంతో భారత్ సహా అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే.
ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యా చమురు ఆదుకోకపోతే ఇంధన ధరలకు అడ్డూఅదుపూ లేకుండాపోయేదన్నది కాదనలేని కఠిన సత్యం. వాస్తవానికి ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతమే. నాడు భారత్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడేది. అయితే, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించడంతో చమురు అమ్మకాలపై రష్యా భారీ రాయితీ ప్రకటించాల్సి వచ్చింది.
దీన్ని అవకాశంగా మలుచుకొని పెద్ద మొత్తంలో లబ్ధిపొందిన భారత్ ఒకానొక దశలో 35-- శాతం వరకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నది. అయితే, ఆ తర్వాత అగ్రరాజ్యం టారిఫ్‌లకు తలొగ్గి చౌకగా లభిస్తున్న రష్యా చమురు దిగుమతులను భారత్ తగ్గించు కోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన సంక్షోభం నెలకొనగా భారత్‌ను మరోసారి రష్యా చమురు ఆదుకోవడం గమనార్హం.
ముఖ్యంగా రష్యా నుంచి వచ్చే చము రు హోర్ముజ్ జలసంధిపై ఆధారపడకపోవడంతో భారత దిగుమతులు నేడు రోజుకు 2.3 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నట్టు పలు నివేదికలు చెప్తున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభం కారణంగా గతంలో వలె భారీ రాయితీలు అందకపోవడం శోచనీయం.
చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతులపై ఆధారపడుతున్న తరుణంలో అమెరికా ఆంక్షల విష యంలో భారత్ స్పష్టమైన వైఖరి తీసుకోవడం శుభసూచకం. సంక్షోభ సమ యం కాబట్టి దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యమిస్తూ, 140 కోట్ల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా భారత్ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.






