ఉద్యమకారుల గుర్తింపా? కాలయాపన వ్యూహమా?
తెలంగాణ మలిదశ ఉద్యమం ముగిసి దశాబ్ద కాలం దాటినా, స్వరాష్ట్ర కల కోసం రక్తం చిందించిన నిజమైన పోరాటయోధుల గుర్తింపు ఇప్పటికీ ఓ అపరిష్కృత ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో అర్హులైన ఉద్యమకారులను ఏరికోరి పారదర్శకంగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ హైదరాబాద్‌లో తొలి సమావేశాన్ని నిర్వహించడం ముదావహం.
ముఖ్యమంత్రి కేరళ పర్యటన ముగియగానే ఈ కమిటీ తన చరిత్రాత్మక కార్యాచరణను ఆయన ముం దుంచి తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, 1969 నాటి తొలిదశ పోరాటం నుంచి 2014 వరకు సాగిన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్న లక్షలాది మందిలో.. నిఖార్సైన త్యాగధనులను వేరుచేయడం ప్రాక్టికల్‌గా సాధ్యమే నా? లేక ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సాగదీసే కాలయాపన వ్యూహమా? అనే అంశంపై క్షేత్రస్థాయిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
సానుకూల దృక్పథంతో విశ్లేషిస్తే, ఈ నిర్ణయం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక చరిత్రాత్మక అడుగు. గత పాలకుల కాలంలో రాజకీయ అండదండలున్న కొద్దిమందికే ప్రభుత్వ ఫలాలు అందాయనే అసంతృప్తి నిరుద్యోగుల్లో, మేధావుల్లో, ఉద్యమకారుల్లో బలంగా ఉంది. దానికి భిన్నంగా, ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని కమిటీ భావించడం హర్ష ణీయం.
పైగా, ఉద్యమ కేంద్ర బిందువైన అమరవీరుల జ్యోతి కిందే ఈ కమిటీ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఉద్యమస్ఫూర్తికి ఇచ్చే అసలైన గౌర వమని చెప్పవచ్చు. కమిటీ ప్రతిపాదించిన నాలుగు వర్గీకరణలు కూడా అత్యంత శాస్త్రీయంగా, లోతుగా ఉన్నాయి. ప్రాణాలు కోల్పో యిన అమరవీరుల కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం, లాఠీచార్జీలు, కాల్పుల్లో అంగవైకల్యం పాలైనవారిని రెండవ కేటగిరీగా గుర్తించడం, జైలు శిక్షలు అనుభవించి జీవితాలను పాడుచేసుకున్నవారిని మూడవ కేటగి రీగా చేర్చడం సమంజసంగా ఉంది.
అలాగే, క్షేత్రస్థాయి ఉద్యమకారుల కోసం వివిధ జేఏసీలు, 1969 నాటి సీనియర్ నాయకులు, ఉద్యోగ సంఘాలు, కళాకారులు, న్యాయవాదులు, సామాజిక సంఘాల నుంచి ప్రతిపాదనలు సేకరించాలని భావించడం, కమిటీ స్వయంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టి ప్రజల వద్దకే వెళ్లాలనుకోవడం ప్రజాస్వామ్యయుతమైన పద్ధతి. ఇది కచ్చితంగా అర్హులైన చివరి వ్యక్తికి కూడా న్యాయం చేకూరుస్తుందని ఆశించవచ్చు.
అయితే, నాణేనికి ఉన్న మరో వైపును పరిశీలిస్తే ఈ ప్రక్రియ ఆచరణలో ఒక అగమ్య గోచరమైన టాస్క్‌లా కనిపిస్తోంది. దాదాపు 45 ఏళ్ల పాటు సాగిన విభిన్న ఉద్యమాల్లో పాల్గొన్న కోట్లాది మంది ప్రజలను వడపోతపోయడం మానవమాత్రులకు సాధ్యమయ్యే పనేనా? ముఖ్యంగా, క్షేత్రస్థాయి ఉద్యమకారులను గుర్తించడానికి ‘పేపర్ కటింగ్స్’ను సాక్ష్యం గా అడగడం క్షేత్రస్థాయి వాస్తవాలను వెక్కిరించడమే అవుతుంది. నాడు పల్లెల్లో, మారు మూల తండాల్లో పోలీసు లాఠీలకు ఎదురొడ్డి జెండాపట్టిన సామాన్య జనానికి పత్రికల్లో పేర్లు రాలేదు, ఫోటోలు పడలేదు.
నాడు జైళ్లపాలైన సగటు తెలంగాణ బిడ్డ దగ్గర దశాబ్దాల నాటి ఎఫ్‌ఐఆర్ కాపీలు, కోర్టు పత్రాలు భ ద్రంగా ఉంటాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా, వివిధ కుల, సామాజిక సంఘాల నుంచి ప్రతిపాదనలు సేకరిస్తే.. సహజంగానే క్షేత్రస్థాయిలో సిఫారసుల పర్వం మొదలై, రాజకీయ పట్టున్న పైరవీకారులకే గుర్తింపు కార్డులు దక్కే ప్రమాదం ఉంది.
చివరగా, ఈ చరిత్రాత్మక ప్రయత్నం తీవ్రమైన ఆచరణాత్మక అయోమయంలో పడింది. 1969 కాలం నాటి ఉద్యమకారులు ఇప్పటికీ ఎంతమంది జీవించి ఉన్నారు? ఒకవేళ ఉన్నా వారి త్యాగాలకు ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? పేపర్ కటింగ్స్ ఉన్నవారే ఉద్యమకా రులైతే, తెరవెనుక ఉండి ఉద్యమానికి ఆర్థికం గా, నైతికంగా వెన్నుదన్నుగా నిలిచిన పౌరసమాజం పరిస్థితి ఏమిటి? ఆశావహ దృక్పథం, ఆచరణాత్మక వైఫల్యాల మధ్య ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ ఉద్యమకారులకు న్యాయం చేస్తుందో, లేక కేవలం మరొక రాజకీయ ప్రహసనంగా మిగిలిపోతుందో చూడాలి.
సెల్: 9848559863
వెంకగారి భూమయ్య






