24 July, 2026 | 3:25 AM

డ్రగ్స్‌కు దూరంగా ఉంటే ఉజ్వల భవిష్యత్తు

24-07-2026 12:00 AM

మంత్రి శ్రీమతి కొండా సురేఖ

హన్మకొండ (మహబూబాబాద్), జూలై 23 (విజయక్రాంతి): డ్రగ్స్ కి దూరంగా ఉంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ప్రజలు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వంతో ముందుకు నడవాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ హనుమకొండ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హనుమకొండ కలెక్టరేట్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు 2కే రన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా హాజరుకాగా, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, వరంగల్ డీసీపీ ధారా కవిత పాల్గొని జెండా ఊపి 2కే రన్ను ప్రారంభించారు. అనంతరం అధికారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో కలిసి ‘సే నో టూ డ్రగ్స్’ ప్రతిజ్ఞ చేయించారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, డి పి ఆర్ ఓ అయుబ్ అలీ, కుడా మాజీ చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్ తో పాటు జర్నలిస్ట్ యూనియన్ బాధ్యులు ,పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.