మబ్బులు చూసి మోసపోకండి..
- ఆరు తడి పంటలే మేలు..
- ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్
కేసముద్రం, జులై 2౩ (విజయక్రాంతి): మబ్బులు చూసి వాన కురుస్తుందనుకొని.. వరి పంట సాగు చేయకండి.. అవి ఉత్తమబ్బులే.. వానలు కురవవు.. చెరువులు నిండవు.. ఎల్ నినో కరువు సృష్టించడం ఖాయం.. ప్రభుత్వం రాయితీ పై అందిస్తున్న ఆరుతడి పంటల సాగు విత్తనాలను నాటుకోవడం ఉత్తమమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ రైతులను కోరారు.
గురువారం కేసముద్రం మండల రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రైతులకు రాయితీ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే పంటల సాగు పూర్తి కావాల్సి ఉందని, ఎల్ నినో ప్రభావంతో వరి పంట సాగు పూర్తిగా వెనుకబడిపోయిందని, ఓ రకంగా కరువు పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, వర్షాలు కురిసే పరిస్థితి లేదని రైతులు వరి పంట సాగు చేయడం వల్ల నష్టాల పాలు కావాల్సి వస్తుందని చెప్పారు.
ఎల్ నినో ప్రభావం ముగిసి, తరువాత వర్షాలు కురిస్తే యాసంగిలో వరి సాగు చేయవచ్చని, అప్పటివరకు ఓపిక పట్టి ఆరు తడి పంటలను మాత్రమే సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత, ఎంపీడీవో క్రాంతి, ఉప తహసిల్దార్ ఎర్రయ్య, ఏవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






