25, 26 తేదీల్లో రవీంద్రభారతిలో యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ - 2026
యాదాద్రి ఫెస్టివల్ చైర్మన్ విక్రమ్ కుమార్
ముషీరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): కళాకృతి నృత్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 25, 26 తేదీలలో రవీంద్ర భారతిలో ’యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2026’ (యాదాద్రి జాతీయ నృత్య ఉత్సవం) నిర్వహించనున్నట్లు యాదాద్రి ఫెస్టివల్ చైర్మన్ విక్రమ్ కుమార్ డైరెక్టర్గా ఎమ్. భారతిలు తెలిపారు.
ఈ మేరకు బుధవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశంలో యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశపు సంపన్న శాస్త్రీయ, జానపద నృత్య వారసత్వాన్ని జాతీయ స్థాయిలో కొనియాడే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని రూపొందించినట్లు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గౌరవ అతిథిగా గడ్డం సరోజ వివేక్ తో పాటు కళా, సాంస్కృతిక, ప్రజాసేవ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా భారతీయ నృత్య, సాంస్కృతిక రంగాలలో విశేష కృషి చేసిన వి.ఎ.కె. రంగారావు, పద్మశ్రీ గీతా చంద్రన్, షారన్ లోవెన్, ప్రొఫెసర్ డాక్టర్ అరుణా భిక్షు తదితరులకు యాదాద్రి జాతీయ పురస్కారాలు 2026 అందజేయనున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ నృత్యోత్సవంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రముఖ కళాకారులు భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, గోటి పువా మరియు సాంప్రదాయ జానపద నృత్య రీతులలో ఆకట్టుకునే ప్రదర్శనలు ఇవ్వనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సజని వల్లభనేని, బి హేమలత పాల్గొన్నారు.






